షావుకారు జానకితో మా అనుబంధం ప్రత్యేకం: బాలకృష్ణ

Balakrishna says our bond with Sowcar Janaki is special
  • సీనియర్ నటి షావుకారు జానకి మృతి పట్ల బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి
  • తన తండ్రి ఎన్టీఆర్‌కు తొలి హీరోయిన్ జానకి అని గుర్తు చేసుకున్న బాలయ్య
  • తమ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలోనూ జానకి గారికి స్థానం ఉందని వెల్లడి
  • తాను కూడా జానకి గారితో కలిసి రెండు చిత్రాల్లో నటించానని తెలిపిన బాలకృష్ణ
  • 75 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానం సాగించిన గొప్ప నటి అని కొనియాడిన బాలయ్య
మేటి నటి షావుకారు జానకి మృతి పట్ల నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆమెతో తమ నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకుంటూ భావోద్వేగభరిత ప్రకటన విడుదల చేశారు.

"మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా నటించి, రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలక పాత్ర ధరించారు. 'పాండురంగ మహాత్మ్యం' నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. 

మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటాను. అంతటి సుదీర్ఘ నటనాజీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు జానకిగారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంటూ బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Advertisement
Sowcar Janaki
Nandamuri Balakrishna
NTR
Telugu Cinema
Sowcar Janaki Death
Tollywood News

More Telugu News