దేశంలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ.. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్ష
- జాతీయ స్థాయి సన్నద్ధత, నివారణ చర్యలపై నడ్డా సమీక్ష
- నిరంతర నిఘా, వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యలను సమీక్షించిన నడ్డా
- వ్యాధి లక్షణాలున్నవారిని ముందస్తుగా గుర్తించడం కీలకమన్న కేంద్ర మంత్రి
దేశంలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, జాతీయ స్థాయి సన్నద్ధత, నివారణ చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిరంతర నిఘా, వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యలు పటిష్ఠంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన ప్రాంతాల్లోని ఆసుపత్రులలో బెడ్ల లభ్యత, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుతో పాటు అవసరమైన మందులు, టీకాల లభ్యతపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, హెల్త్ సెక్రటరీలతో కూడిన బృందానికి నిరంతరం కేసులను పర్యవేక్షించాలని సూచించారు.
ముఖ్యంగా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ముందస్తుగా గుర్తించడం, బాధితులకు సకాలంలో చికిత్స అందించడం.. ప్రజల్లో పరిశుభ్రత, అవగాహన పెంపొందించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల జిల్లాల్లో కూడా అవసరమైన ఫ్లూ నిరోధక మందుల కొరత లేకుండా చూడాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలను కోరారు.