ఈనెల 29 నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మూడో దశ పనులు: నారాయణ

Minister Narayana says Amaravati Seed Access Road phase 3 works from November 29
  • ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ పనులపై దృష్టి సారించామన్న నారాయణ
  • ఆ తర్వాత విమానాశ్రయం నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • ఇకపై ప్రతినెలా ఒక టవర్ పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించామన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ పనులపై మంత్రి నారాయణ ప్రకటన చేశారు. ఈ నెల 29వ తేదీన మూడో దశ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


గతంలో రాజధాని రైతులు అమరావతి పరిరక్షణ కోసం చేపట్టిన 'న్యాయస్థానం టు దేవస్థానం' పాదయాత్ర ఇదే తుళ్లూరు ఆలయం నుంచే ప్రారంభమై విజయవంతమైందని మంత్రి గుర్తుచేశారు. రైతుల త్యాగాల పునాదులపైనే అమరావతి మళ్లీ పునర్నిర్మాణం అవుతోందన్నారు. రాజధాని నిర్మాణంలో భాగమైన ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ పనులపై ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారించామని, ఆ తర్వాత విమానాశ్రయం నిర్మాణ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అమరావతి పరిపాలనా నగరంలో టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ ప్రతినెలా ఒక్కో టవర్ నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. అలాగే, రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నెల 27న టెండర్లు ఓపెన్ చేస్తున్నామని, ప్రక్రియ పూర్తి కాగానే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా మొదలుపెడతామని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Ponguru Narayana
Amaravati Seed Access Road
Andhra Pradesh Capital Construction
Amaravati Inner Ring Road
Thullur Capital Development
Amaravati Farmers Returnable Plots

More Telugu News