గ్రీన్ కార్డు ఉన్నా వీడని కష్టాలు.. 27 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న‌ భారత సంతతి మహిళ నిర్బంధం

Venkata Narasamamba Vasamsetti detained by US immigration despite having a Green Card for 27 years
  • 27 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న భారత సంతతి మహిళ అరెస్ట్
  • గ్రీన్ కార్డు హోల్డర్ అయినప్పటికీ ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్బంధం
  • ఆమెపై ఉన్న కేసును న్యాయమూర్తి కొట్టేసినా ఆగని వేధింపులు
  • భారత్‌లో 7 నెలలు ఉండటమే ఈ వివాదానికి అసలు కారణం
  • తల్లిదండ్రుల అనారోగ్యం, కొవిడ్ వల్లే ప్రయాణం ఆలస్యమైందని వాదన
అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న భారత సంతతి మహిళకు ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రీన్ కార్డు హోల్డర్ అయిన వెంకట నర్సమాంబ వాసంశెట్టిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను దేశం నుంచి పంపేయాలన్న ప్రయత్నాలను కొన్ని నెలల క్రితమే ఓ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి తిరస్కరించినప్పటికీ, ఈ నిర్బంధం చోటుచేసుకోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. 2013 నుంచి చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాలో ఉన్న వాసంశెట్టి, ఆగస్టు 11న షెడ్యూల్ ప్రకారం 'ఐస్' కార్యాలయంలో చెక్-ఇన్ కోసం వెళ్లారు. ఆ సమయంలో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని జార్జియాలోని డిటెన్షన్ కేంద్రానికి తరలించారు. వాస్తవానికి ఆమెపై ఉన్న 'బ‌హిష్క‌ర‌ణ‌' కేసును మే 19న ఒక న్యాయమూర్తి కొట్టివేశారు. అయినప్పటికీ ఆమెను నిర్బంధించడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివాదానికి కారణమేంటి?
2022లో వాసంశెట్టి సుమారు 7 నెలల పాటు భారత్‌లో గడపడమే ఈ వివాదానికి మూలం. అమెరికా చట్టాల ప్రకారం, గ్రీన్ కార్డు హోల్డర్లు 180 రోజులకు మించి దేశం వెలుపల ఉంటే, వారు తమ శాశ్వత నివాస హోదాను వదులుకోవడానికి సిద్ధపడ్డారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె తన శాశ్వత నివాస హోదాను వదులుకున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్‌) ఆరోపించింది.

అయితే, ఈ వాదనను ఆమె కుటుంబం, న్యాయవాది తీవ్రంగా ఖండిస్తున్నారు. 2022 జులైలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి వాసంశెట్టి భారత్‌కు వచ్చారని వారు తెలిపారు. ఆ సమయంలో ఆమె కొవిడ్ బారిన పడి ఆసుపత్రిలో కూడా చికిత్స పొందారని, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ప్రయాణం ఆలస్యమైందని వివరించారు. అమెరికాలో తన కుటుంబం, ఉద్యోగం, ఇల్లు ఉన్నాయని, ఆమె ఉద్దేశం తాత్కాలిక ప్రయాణమే తప్ప శాశ్వతంగా భారత్‌లో స్థిరపడటం కాదని స్పష్టం చేశారు. ఆమె భారత్‌లో ఉన్నప్పుడే నార్త్ కరోలినాలో ఇల్లు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారని, ఇది అమెరికాలో స్థిరపడాలన్న ఆమె ఉద్దేశానికి నిదర్శనమని వాదిస్తున్నారు.

న్యాయపోరాటం
వాసంశెట్టిపై డీహెచ్ఎస్‌ పెట్టిన కేసులో తమ వాదనలకు మద్దతుగా సరైన ఆధారాలు సమర్పించడానికి ఇచ్చిన గడువులోగా అధికారులు విఫలమయ్యారు. దీంతో ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి మే 19న కేసును కొట్టివేశారు. అయినప్పటికీ ఆమెను ఇప్పుడు నిర్బంధించడంతో న్యాయవాదుల బృందం ఆగస్టు 13న ఫెడరల్ కోర్టులో ఎమర్జెన్సీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ఆమె నిర్బంధానికి గల చట్టపరమైన కారణాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.

వాసంశెట్టి 27 ఏళ్లుగా అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్నారని, ఆమెపై ఎలాంటి నేర చరిత్ర లేదని, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు టీచర్‌గా పనిచేస్తున్నారని ఆమె న్యాయవాదులు పేర్కొంటున్నారు. తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్న ఆమెకు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫెడరల్ కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే, ఆమెకు బాండ్ హియరింగ్ ద్వారా బెయిల్ లభించే అవకాశం ఉంది.
Advertisement
Venkata Narasamamba Vasamsetti
US Immigration and Customs Enforcement
Indian Green Card holder detention
US immigration laws 180 days rule
Georgia detention center
Habeas corpus petition US court

More Telugu News