పాక్‌ క్రికెట్‌లో కీలక మార్పులు.. టీ20 కెప్టెన్‌పై వేటు!

పాక్‌ క్రికెట్‌లో కీలక మార్పులు.. టీ20 కెప్టెన్‌పై వేటు!

Pakistan T20 captain sacked new captain for Sri Lanka series
  • పాక్‌ టీ20 కెప్టెన్‌గా సల్మాన్‌ తొలగింపు
  • కొత్త కెప్టెన్‌గా సాహిబ్‌జాదా ఫర్హాన్‌
  • టీ20 జట్టులోనూ చోటు దక్కించుకోని సల్మాన్‌
  • బాబర్‌ అజామ్‌కు సైతం టీ20 జట్టు మొండిచేయి
  • వన్డే కెప్టెన్‌గా కొనసాగనున్న షహీన్‌ అఫ్రిది
పాకిస్థాన్‌ క్రికెట్‌లో కీలక మార్పు జరిగింది. టీ20 జట్టు కెప్టెన్‌ సల్మాన్‌ అలీ ఆఘాను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అంతేకాదు.. శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు అతడిని జట్టు నుంచి కూడా పక్కన పెట్టారు. అతడి స్థానంలో సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌ శుక్రవారం రావల్పిండిలో ప్రారంభం కానుంది.

సల్మాన్‌ నాయకత్వంలో పాక్‌ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. గతేడాది ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడింది. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్‌కు చేరలేకపోయింది. మరోవైపు.. ఇటీవల ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌కు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ నాయకత్వం వహించాడు. అయితే ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.

టీ20 జట్టులో మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌కు కూడా చోటు దక్కలేదు. 2026 టీ20 ప్రపంచకప్‌ తర్వాత పలువురు ఆటగాళ్లను పక్కన పెట్టి.. ఆసియా క్రీడల్లో రాణించిన వారికి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. భారత్‌తో ఆసియా క్రీడల ఫైనల్లో 96 పరుగులు చేసిన హసన్‌ నవాజ్‌ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అబ్దుల్‌ సమద్‌, మాజ్‌ సదాఖత్‌, అరాఫత్‌ మిన్హాస్‌, సుఫియాన్‌ మొకీమ్‌లకు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది.

పేసర్‌ నసీమ్‌ షా కూడా తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన రజావుల్లాకు తొలిసారి వైట్‌బాల్‌ జట్లలో చోటు కల్పించారు. అయితే షహీన్‌ షా అఫ్రిది టీ20 జట్టులో లేడు. అక్టోబర్‌ 18 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక, ఇంగ్లండ్‌తో వన్డే ట్రై సిరీస్‌కు అతడే కెప్టెన్‌. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించిన సల్మాన్‌కు వన్డే జట్టులో మాత్రం చోటు దక్కింది.
Advertisement
Salman Ali Agha
Sahibzada Farhan
Pakistan T20 captain
Pakistan vs Sri Lanka T20 series
Babar Azam
Shaheen Shah Afridi

More Telugu News