తెలంగాణలో డైనోసార్లు తిరిగాయా? మంచిర్యాల అడవుల్లో దాగిన కోట్ల ఏళ్ల రహస్యం!

తెలంగాణలో డైనోసార్లు తిరిగాయా? మంచిర్యాల అడవుల్లో దాగిన కోట్ల ఏళ్ల రహస్యం!

Did Dinosaurs roam in Telangana The million year secret hidden in Mancherial forests
  • వేమనపల్లి ప్రాంతంలో డైనోసార్‌ అవశేషాల గుర్తింపు
  • 1984లో అవశేషాలు బయటపడినట్లు సమాచారం
  • ప్రాణహిత పరివాహకంలో శిలాజాల ఆనవాళ్లు
  • రాజారంలో కాకతీయుల కాలం నాటి విగ్రహాలు
  • 12వ శతాబ్దానికి చెందిన దశావతార విగ్రహాలు
తెలంగాణ అంటే చారిత్రక కోటలు, దేవాలయాలు, పచ్చని అడవులు గుర్తొస్తాయి. కానీ.. ఈ నేలపై కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్లు సంచరించాయంటే నమ్మగలరా? మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి ప్రాంతం అలాంటి ఆసక్తికర విషయాలను తనలో దాచుకుంది. ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో డైనోసార్‌ అవశేషాలు, వివిధ జీవుల శిలాజాలు బయటపడినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. అదే ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక ఆనవాళ్లు కూడా ఉండటం విశేషం.

డైనోసార్‌ అవశేషాలు
మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ప్రాణహిత నది ప్రవహించే ప్రాంతమే వేమనపల్లి. 1984లో మంగెనపల్లి అటవీ ప్రాంతంలో భూగర్భ, పురావస్తు శాఖ అధికారులు డైనోసార్‌ అవశేషాలను గుర్తించారు. సుమారు 14 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల ఎత్తు ఉన్న జీవికి చెందిన అవశేషాలు బయటపడటంతో అప్పట్లో సంచలనం రేగింది. సుంపుటం, ఒడ్డుగూడెం, మంగెనపల్లి ప్రాంతాల్లోనూ అవశేషాలు లభించినట్లు స్థానికులు చెబుతున్నారు.

రాళ్లలో దాగిన జీవం
వేమనపల్లి పరిసరాల్లో శిలాజీకరణ చెందిన చెట్ల ఆనవాళ్లు కూడా కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. వాగులు, నది మలుపుల వెంట వివిధ ఆకారాల్లో రాళ్లు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని చేపలు, సముద్ర నక్షత్రాలు, తాబేళ్ల ఆకారాలను పోలి ఉంటాయని చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదల సమయంలో చెట్లు ఇసుక పొరల్లో కూరుకుపోయి.. చాలా కాలానికి శిలాజాలుగా మారి ఉండొచ్చని భావిస్తున్నారు.

కాకతీయుల ఆనవాళ్లు కూడా..
వేమనపల్లి ప్రత్యేకత డైనోసార్లతోనే ఆగిపోలేదు. రాజారం గ్రామంలోని దశావతార విగ్రహాలు సుమారు 12వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ఇవి కాకతీయుల కాలం నాటి చారిత్రక ఆనవాళ్లుగా గుర్తింపు పొందాయి. అంటే.. ఒకవైపు కోట్ల ఏళ్ల క్రితం జీవించిన జీవుల ఆనవాళ్లు.. మరోవైపు శతాబ్దాల క్రితం మనుషులు నిర్మించిన చారిత్రక గుర్తులు ఇక్కడ కనిపిస్తాయి.

ప్రకృతి, చరిత్ర కలిసిన ప్రాంతం
ప్రాణహిత నది, దట్టమైన అడవులు, అరుదైన వృక్షజాతులు, శిలాజాలు, డైనోసార్‌ అవశేషాలు, కాకతీయుల కాలం నాటి విగ్రహాలు.. ఇలా వేమనపల్లిలో ప్రకృతి, చరిత్ర, భూగర్భ రహస్యాలు ఒకే చోట కనిపిస్తాయి. ఈ ప్రాంతంలోని పురాతన ఆనవాళ్లపై మరింత శాస్త్రీయ పరిశోధన జరిగితే తెలంగాణ గతానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Mancherial
Telangana Dinosaurs
Vemanapalli Fossils
Pranhita River
Kakatiya History
Prehistoric Telangana

More Telugu News