పాములందు ఈ సింగపూర్ పాము వేరయా!

Blue necked keelback snake spotted in Singapore MacRitchie Reservoir
  • సింగపూర్‌లోని మెక్‌రిచీ రిజర్వాయర్‌లో అరుదైన నీలి మెడ పాము గుర్తింపు
  • ఈ పాము కాటు ద్వారా విషాన్ని ఎక్కించగలదు, తిన్నా కూడా ప్రాణాంతకమే!
  • దీనిని ఎవరూ ముట్టుకోవద్దని నేషనల్ పార్క్స్ బోర్డ్ హెచ్చరిక
  • స్థానికంగా అంతరించిపోయే దశలో ఉన్న జాతిగా వర్గీకరణ
సింగపూర్‌లోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఒక అరుదైన పాము కనిపించడం వన్యప్రాణి నిపుణులతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించింది. కాటు వేయడం ద్వారా విషాన్ని చిమ్మడమే కాకుండా, తనను ఆహారంగా తీసుకునే ఇతర జీవులకు కూడా హాని చేసే ద్వంద్వ విష లక్షణాలు కలిగిన ఈ పామును 'బ్లూ నెక్డ్ కీల్‌బ్యాక్' అని పిలుస్తారు. మెక్‌రిచీ రిజర్వాయర్‌ పరిసరాల్లో ఈ పాము తారసపడటంతో, ప్రజలు దానికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆగస్టు 1న మెక్‌రిచీ నేచర్ ట్రయిల్‌లో ఒక ఫొటోగ్రాఫర్‌కు ఈ పాము కనిపించింది. నోటిలో సగం మింగిన కప్పతో ఉన్న ఈ పాము ఛాయాచిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నేషనల్ పార్క్స్ బోర్డ్, అది అరుదైన 'బ్లూ నెక్డ్ కీల్‌బ్యాక్' పామేనని ఆగస్టు 4న ధ్రువీకరించింది. ఈ పామును పట్టుకోవడానికి ఎవరూ ప్రయత్నించవద్దని ఈ సందర్భంగా సూచించింది.

శాస్త్రీయంగా రాబ్డోఫిస్ రోడోమెలాస్ అని పిలిచే ఈ పాము సుమారు 75 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. నారింజ-గోధుమ రంగు శరీరం, నీలి రంగు మెడ దీని ప్రత్యేక గుర్తింపు. ఇది విషపూరితమైన పాము కావడంతో పాటు, దీనిని ఇతర జంతువులు ఆహారంగా తీసుకుంటే వాటికి కూడా ప్రాణహాని కలుగుతుంది. సింగపూర్‌లోని సెంట్రల్ నేచర్ రిజర్వ్స్‌ పరిధిలోని అడవులు, చిత్తడి నేలల్లో కనిపించే ఈ పాము ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంది. ఈ పాము ఎక్కడైనా కనిపిస్తే, ముఖ్యంగా అది ఆహారం తీసుకుంటున్న సమయంలో ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Blue necked keelback
Singapore rare snake
MacRitchie Reservoir
Rhabdophis rhodomelas
Venomous snakes in Singapore

More Telugu News