కశ్మీర్‌లో గాజా తరహా సొరంగ యుద్ధం.. పాక్‌ కొత్త కుట్ర ఇదేనా?

Pakistan planning Gaza style tunnel warfare in Kashmir
  • హమాస్‌-లష్కర్‌-జైష్‌ సంబంధాలపై భారత భద్రతా వర్గాల హెచ్చరిక
  • పీవోకేలో సొరంగ యుద్ధానికి ఉగ్రవాదుల సన్నద్ధతపై ఆందోళన
  • హమాస్‌ నుంచి గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు పొందే అవకాశం
  • కశ్మీర్‌లో డ్రోన్లు, గ్లైడర్ల ముప్పుపై హెచ్చరిక
  • ఉగ్ర సంస్థలతో భారత్‌పై సుదీర్ఘ పోరుకు పాక్‌ వ్యూహం
కశ్మీర్‌లో గాజా తరహా సొరంగ యుద్ధానికి ఉగ్రవాద సంస్థలను పాక్‌ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హమాస్‌ నుంచి లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్‌ (జేఈఎం)కు యుద్ధ నైపుణ్యాలు అందేలా పాకిస్థాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ వ్యూహం పన్నుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా హమాస్‌, పాక్‌ ఉగ్ర సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాలపై భారత భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో సొరంగాల ఆధారంగా గెరిల్లా యుద్ధం సాగించేలా లష్కర్‌, జైష్‌ను సిద్ధం చేయడం ఈ వ్యూహంలో భాగమని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్‌ పోరులో ఉపయోగిస్తున్న సొరంగ యుద్ధ పద్ధతులను పాక్‌ ఉగ్ర సంస్థలకు అందించాలన్నది లక్ష్యంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.

ఉదయ్‌పూర్‌కు చెందిన ఉసానాస్‌ ఫౌండేషన్‌ తాజాగా విడుదల చేసిన ‘హమాస్‌-పాకిస్థాన్‌ నెక్సస్‌: ఏ థ్రెట్‌ టు ఇండియా అండ్‌ ఇజ్రాయెల్‌’ నివేదికలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. పీవోకేలో భారీ సొరంగ వ్యవస్థలు ఏర్పాటైతే భారత సైన్యానికి కొత్త సవాలు ఎదురవుతుందని పేర్కొంది. గాజాలో ఇజ్రాయెల్‌ ఎదుర్కొంటున్న గెరిల్లా తరహా పోరును కశ్మీర్‌లోనూ ఉగ్రవాదులు అనుసరించే అవకాశం ఉందని తెలిపింది.

హమాస్‌ అనుభవం సొరంగ యుద్ధానికే పరిమితం కాదని నివేదిక పేర్కొంది. డ్రోన్లు, గ్లైడర్ల వినియోగంలోనూ ఆ సంస్థ అనుభవాన్ని పాక్‌ ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిలో వీటిని ఉపయోగించిన విషయాన్ని గుర్తుచేసింది.

ఈ వ్యూహం పాకిస్థాన్‌ సైన్యానికి మరో ప్రయోజనం కలిగించవచ్చని భారత అధికారులు చెబుతున్నారు. ఉగ్ర సంస్థలు ముందుండి పోరాడితే పాక్‌ సైన్యం వెనుక నుంచి మద్దతు ఇవ్వొచ్చని అంటున్నారు. దీంతో భారత్‌తో నేరుగా యుద్ధం చేస్తున్నట్టు ఆరోపణలు రాకుండా తప్పించుకునే అవకాశం పాక్‌కు ఉంటుందని ఓ ఐబీ అధికారి పేర్కొన్నారు.

ఇటీవల పాకిస్థాన్‌లో హమాస్‌, లష్కర్‌, జైష్‌కు చెందిన ప్రతినిధులు పాల్గొన్న సమావేశాలు, ర్యాలీలు జరగడం కూడా భద్రతా వర్గాల్లో ఆందోళన పెంచింది. గాజా, కశ్మీర్‌ పరిస్థితులను ఒకటిగా చూపించే ప్రచారం అక్కడ సాగుతోందని అధికారులు చెబుతున్నారు. గతేడాది దోహాలో పాక్‌ రాయబారి లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) మహ్మద్‌ ఆమిర్‌, హమాస్‌ నేత బాసెమ్‌ నయీమ్‌ భేటీ కావడాన్ని ఉసానాస్‌ ఫౌండేషన్‌ తన నివేదికలో ప్రస్తావించింది.
Advertisement
Pakistan
Kashmir tunnel warfare
Hamas LeT JeM nexus
PoK terrorist training
Usanas Foundation report
Gaza style guerrilla war

More Telugu News