చిక్కుల్లో బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్.. 20 ఏళ్ల జైలు శిక్ష పడే నేరం!

Bill Gates daughter Phoebe Gates in trouble crime carries 20-year jail sentence
  • బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్ స్టార్టప్‌పై తీవ్ర ఆరోపణలు
  • కుకీ స్టఫింగ్’ అనే మోసపూరిత విధానంతో ఆదాయం పొందినట్లు వెల్లడి
  • ఈ నేరం రుజువైతే అమెరికాలో 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
  • నైక్, గ్యాప్ వంటి బ్రాండ్ల అమ్మకాలను ప్రభావితం చేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక
  • ఇది కేవలం సాంకేతిక లోపమేనని, సరిదిద్దామని చెబుతున్న కంపెనీ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్‌కు చెందిన‌ షాపింగ్ స్టార్టప్ ‘ఫియా’ (Phia) తీవ్రమైన ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. ‘కుకీ స్టఫింగ్’ అనే మోసపూరిత టెక్నిక్‌ను ఉపయోగించి అక్రమంగా ఆదాయం పొందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఈ తరహా చర్యలను తీవ్రమైన ‘ఫెడరల్ వైర్ ఫ్రాడ్’గా పరిగణిస్తారు. ఒకవేళ నేరం రుజువైతే గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు కాలేదు.

అసలేమిటీ ‘కూకీ స్టఫింగ్’?
వినియోగదారులు ఒక వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, వారు ఆ సంస్థ అందించే కూపన్లు లేదా ఇతర సేవలను వాడకపోయినా సరే, వారి బ్రౌజర్‌లో బలవంతంగా ట్రాకింగ్ కుకీలను చొప్పించడాన్ని ‘కుకీ స్టఫింగ్’ అంటారు. దీనివల్ల ఆ తర్వాత యూజర్ ఏదైనా కొనుగోలు చేస్తే, ఆ అమ్మకానికి తామే కారణమని చెప్పి ఆన్‌లైన్ రిటైలర్ల నుంచి ఈ సంస్థ అక్రమంగా కమీషన్లు పొందుతుంది.

బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఫియా స్టార్టప్‌లో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సహ వ్యవస్థాపకులైన ఫోబీ గేట్స్, సోఫియా కియానీలకు కనీసం ఏడు నెలల ముందు నుంచే తెలుసని అంతర్గత సమాచారం సూచిస్తోంది. నైక్, గ్యాప్, నార్డ్‌స్ట్రామ్ వంటి ప్రముఖ రిటైలర్ల అమ్మకాలను ఈ విధానం ప్రభావితం చేసిందని, కంపెనీ చూపిన మొత్తం ఆదాయంలో అధిక భాగం దీని ద్వారానే వచ్చిందని ఆ నివేదిక పేర్కొంది.

ఈ ఆరోపణలు బయటకు రావడంతో జులై 7న ఈ ఫీచర్‌ను నిలిపివేసినట్లు ఫియా సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్‌ను తొలగించిన తర్వాత కంపెనీ రోజువారీ సగటు ఆదాయం ఒక్కసారిగా భారీగా పడిపోయినట్లు సమాచారం. జరిగిన పొరపాటుపై తాము సమీక్ష జరుపుతున్నామని, ప్రభావితమైన బ్రాండ్ భాగస్వాములకు డబ్బును వాపసు ఇస్తామని కంపెనీ తెలిపింది. మొదట్లో దీనిని ఒక సాంకేతిక లోపంగా అభివర్ణించిన ఫియా.. ఇప్పుడు పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని, దీని కోసం ఒక కంప్లయన్స్ హెడ్‌ను నియమించుకుంటున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.
Advertisement
Phoebe Gates
Phia Startup
Cookie Stuffing
Bill Gates Daughter
Federal Wire Fraud
Sophia Kiany

More Telugu News