ఐపీఎల్ ఆడితే సరిపోదు.. రంజీలు ఆడాల్సిందే: టీమిండియా ఎంపికపై కపిల్ దేవ్ ఘాటు వ్యాఖ్యలు
- జట్టు ఎదుర్కొంటున్న సమస్యలపై కపిల్ దేవ్ కీలక సూచనలు
- దేశవాళీ క్రికెట్‌లో రాణించిన వారినే టీమిండియాకు ఎంపిక చేయాలన్న కపిల్
- సీనియర్లు సైతం దేశవాళీ మ్యాచ్‌లు ఆడేలా చర్యలు తీసుకోవాలని సూచన
భారత క్రికెట్ జట్టు ఎంపిక విధానం, ఇటీవల భారత బ్యాటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బీసీసీఐకి కీలక సూచనలు చేశారు. భారత సీనియర్, జూనియర్ క్రికెటర్లు ఈ మధ్యకాలంలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఘోరంగా విఫలమవుతున్నారని... స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లతో టెస్టుల్లో ఓడిపోవడం దారుణమని ఆయన అన్నారు.
ఈ పరిస్థితులకు దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేయడమే ప్రధాన కారణమని కపిల్ దేవ్ విశ్లేషించారు. కేవలం ఐపీఎల్‌లో మెరిసినంత మాత్రాన జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం వల్ల జట్టుకు తీవ్ర నష్టం జరుగుతోందని... దేశవాళీ క్రికెట్‌లో (రంజీ ట్రోఫీ వంటి టోర్నీల్లో) నిలకడగా రాణించిన వారిని మాత్రమే టీమిండియాకు ఎంపిక చేయాలని కోరారు. సీనియర్ ఆటగాళ్లు కూడా తప్పనిసరిగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే, టీ20 మ్యాచ్‌లు పెరిగిపోతుండటంతో జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఫాస్ట్ బౌలర్లు తరచూ గాయాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై బీసీసీఐ తక్షణమే స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.