పోలీసులతో కూడా చంద్రబాబు భజన చేయించుకుంటున్నారు: పేర్ని నాని
- ఎస్పీలు, సీఐలతో ముఖ్యమంత్రి నేరుగా సమీక్షలు చేయడం సరికాదన్న పేర్ని నాని
- స్థానిక ఎన్నికల్లో పోలీసులను అడ్డగోలుగా వాడుకునేందుకే ఈ సమీక్షలు అని ఆరోపణ
- ప్రియాంక హత్యపై పవన్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్న
సొంత పార్టీ నేతల భజనతో వచ్చే కిక్ సరిపోక, ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏకంగా ఖాకీ దుస్తుల్లో ఉన్న పోలీసులతోనూ తనను తాను పొగిడించుకుంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయి సీఐలు, ఎస్పీలతో ముఖ్యమంత్రే నేరుగా సమీక్షలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీజీపీ అసమర్థుడు కావడం వల్లే చంద్రబాబు రంగంలోకి దిగారా అని ప్రశ్నించారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులను అడ్డగోలుగా వాడుకునేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సీఎం ధైర్యసాహసాలను కొందరు అధికారులు కొనియాడటాన్ని నిలదీస్తూ... నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవులను లాక్కోవడమే చంద్రబాబు చూపిన ధైర్యమా అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడుతూ, డాక్టర్ ప్రియాంకను కారుతో తొక్కి చంపిన దారుణ ఘటనను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలను కేవలం ప్రమాదాలుగా చిత్రీకరిస్తూ కొందరు పోలీసుల తీరుతో ఖాకీ దుస్తుల పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ గురించి మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రియాంక దారుణ హత్యపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
అమరావతి నిర్మాణం పేరుతో ఛానళ్లకు భారీగా డబ్బులు ఇస్తూ ప్రచార ఆర్భాటాలకు దిగుతున్నారని, ఎమ్మెల్యే క్వార్టర్లను గొప్పగా చూపుతున్న ప్రభుత్వం... రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలను అందులో ఉంచుతుందో చూద్దామని సెటైర్లు వేశారు. ప్రభుత్వానికి రైతుల భూములు కావాలి కానీ వారి కష్టాలు పట్టడం లేదని, వెంటనే కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన ఆరోపణలపైనా పేర్ని నాని ఘాటుగా స్పందించారు. తనపై, తన భార్యపై రూ. 50 కోట్ల ఆరోపణలు చేస్తున్నారని, తాము ఎవరి ఇంటికి వెళ్లామో నిరూపించేలా సీసీటీవీ ఫుటేజీ, ఆధారాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. తాము రూ. 50 కోట్లు ఇచ్చి ఉంటే తమను, ఒకవేళ ఆ డబ్బు చంద్రబాబు తీసుకుని ఉంటే ఆయన్ను జైలులో వేయాలని వ్యాఖ్యానించారు.