నేరస్తులను, అక్రమార్కులను పరామర్శించేందుకే జగన్ యాత్రలు చేపడుతున్నారు: సత్యకుమార్
- ప్రజాసమస్యలపై జగన్ కు చిత్తశుద్ధి లేదని సత్యకుమార్ విమర్శ
- చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్
- వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని మండిపాటు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమాజంలో నేరాలు, అక్రమాలకు పాల్పడే వారిని పరామర్శించడానికే జగన్ ప్రత్యేక యాత్రలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, శాసనసభకు దూరంగా ఉండటం మాని వెంటనే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. జగన్ తాను అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా చట్టసభకు పంపకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ఇదే సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంపై మాట్లాడిన మంత్రి సత్యకుమార్... ప్రజలకు మెరుగైన ఉచిత, త్వరితగతిన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ విధానంలో అధునాతన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.