అమరవీరుల కుటుంబాలకు అండగా తెలంగాణ పోలీస్.. 'టీజీ-వీర్' ఆవిష్కరణ

Telangana Police launch TG VEER portal to support martyrs families
  • పోర్టల్‌ను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్ 
  • ఆర్థిక సాయం, ఉద్యోగాలు, ప్లాట్ల సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం
  • వరంగల్‌లో 28 మంది అమరవీరుల కుటుంబాలతో డీజీపీ భేటీ
  • పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు క్యూఆర్ కోడ్ కార్డుల జారీ
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం ‘టీజీ-వీర్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్‌ను డీజీపీ సీవీ ఆనంద్ ఆదివారం ప్రారంభించారు.

ఈ పోర్టల్ ద్వారా అమరవీరుల కుటుంబాలు తమకు అందాల్సిన ఆర్థిక సాయం, కారుణ్య నియామకాలు, నివేశన స్థలాల కేటాయింపు సహా ఇతర ప్రయోజనాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అమరవీరుడి సర్వీసు వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అందిన ప్రయోజనాలు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఒకేచోట లభ్యమవుతాయి. యూనిట్, రాష్ట్ర స్థాయిల్లోని ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు.

జిల్లాల పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్‌కు చేరుకున్న డీజీపీ సీవీ ఆనంద్.. మావోయిస్టుల పోరాటంలో అసువులు బాసిన 28 మంది పోలీసు కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి క్యూఆర్ కోడ్ ఆధారిత ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నేరుగా ‘టీజీ-వీర్’ పోర్టల్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఎక్స్‌గ్రేషియా, ఆర్థిక సాయం, పెన్షన్ వంటి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పలు కుటుంబాలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్‌ను డీజీపీ ఆదేశించారు.

నక్సల్స్ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న కాలంలో తాను వరంగల్‌లోనే వృత్తి జీవితాన్ని ప్రారంభించానని ఈ సందర్భంగా డీజీపీ గుర్తుచేసుకున్నారు. ఎందరో పోలీసుల ప్రాణత్యాగాల పునాదులపైనే ఈ ప్రాంతంలో నేడు శాంతి నెలకొందని ఆయన పేర్కొన్నారు. అనంతరం, నిర్మాణ దశలో ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.                              
Advertisement
Telangana Police
CV Anand
TG VEER Portal
Police Martyrs Families
Warangal
Grievance Redressal

More Telugu News