హైడ్రా చీఫ్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రముఖ కాలేజీల అక్రమాల రట్టు!
- నకిలీ ఎన్‌ఓసీ పత్రాలను తయారు చేసిన ముఠా గుట్టు రట్టు
- ఇంటర్ బోర్డు అనుమతుల కోసం దొంగ సంతకాలతో నకిలీ ఎన్‌ఓసీలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన హైడ్రా అడిషనల్ డైరెక్టర్లు
హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా’ పేరును వాడుకుని కొందరు అక్రమాలకు యత్నించిన తీరు తీవ్ర కలకలం రేపుతోంది. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ‘ఫైర్ ఎన్‌ఓసీ’ (NOC) పత్రాలను తయారు చేసిన ఒక ముఠా గుట్టు రట్టయింది. ఏకంగా నగరంలోని 8 ప్రముఖ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఈ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా గుర్తింపు పొందేందుకు యత్నించడం విద్యాశాఖతో పాటు పోలీసు వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
హైడ్రా కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే, కమిషనర్ పేరు మీద దొంగ సంతకాలతో ఫేక్ ఎన్‌ఓసీలు సృష్టించారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అఫిలియేషన్ (అనుమతులు) సాధించడం కోసం సదరు ప్రైవేటు కాలేజీలు ఈ నకిలీ పత్రాలను సమర్పించాయి. అయితే బోర్డు అధికారులు, హైడ్రా యంత్రాంగం డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆ సర్టిఫికెట్లు నకిలీవని, వారి సంతకాలు ఫోర్జరీకి గురయ్యాయని తేలింది. ఈ దారుణ అక్రమంపై స్పందించిన హైడ్రా అడిషనల్ డైరెక్టర్లు.. మోసానికి పాల్పడిన 8 కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ లేక్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఫోర్జరీకి పాల్పడిన జూనియర్ కాలేజీలు ఇవే:
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, చాంద్రాయణగుట్ట
రెసోనెన్స్ జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్
హైందవి జూనియర్ కాలేజ్, బర్కత్‌పుర
ప్రియాం జూనియర్ కాలేజ్, మెహదీపట్నం
న్యూ ఎరా జూనియర్ కాలేజ్, చిక్కడపల్లి
మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, విద్యానగర్
షాహీన్ జూనియర్ కాలేజ్, శివరాంపల్లి
వశిష్ట జూనియర్ కాలేజ్, తెల్లాపూర్.