రాష్ట్రం సుభిక్షంగా ఉండటం జగన్‌కు ఇష్టం లేదు: అనగాని
- అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన అనగాని, సవిత
- త్వరలోనే అన్ని భవనాలను హ్యాండోవర్ చేస్తామన్న అనగాని
- అమరావతి మహిళలు, రైతులను జగన్ హింసించారన్న సవిత
వైసీపీ అధినేత జగన్ పై మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం జగన్‌కు అస్సలు ఇష్టం లేదని, అమరావతిపై నాడు తీవ్ర స్థాయిలో విషం చిమ్మారని మండిపడ్డారు. అమరావతిలోని నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అమరావతి వేదికగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.
ముందు అమరావతికి ఒకే చెప్పి, ఆ తర్వాత మూడు రాజధానులంటూ మాట మార్చారని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం తర్వాత అమరావతి కట్టడాల పటిష్ఠతపై నివేదిక తెప్పించి రెండేళ్లలోనే పనులు పూర్తి చేశామని, త్వరలోనే అన్ని భవనాలను హ్యాండ్ ఓవర్ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి కూడా నాడు జగన్ అడ్డుపుల్ల వేశారని దుయ్యబట్టారు.
మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటున్న వైసీపీ నేతలకు 'సైకిక్ ప్రాబ్లమ్ (మానసిక సమస్య)' ఉందంటూ ఎద్దేవా చేశారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, మెగా పీటీఎం వంటి పథకాలు చేపట్టినందుకు లోకేశ్ రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ నేతలకు స్టాన్‌ఫర్డ్ పేరు పలికే అర్హత కూడా లేదని ధ్వజమెత్తారు.
మరొకవైపు మంత్రి సవిత మాట్లాడుతూ... రాజధానిని పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్, రైతులను, అమరావతి మహిళలను హింసించారని మండిపడ్డారు. ప్రస్తుతం అమరావతిలో దాదాపు 30 వేల మంది కార్మికులతో రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జిలు, మంత్రుల బంగ్లాలు వేగంగా సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని తట్టుకోలేకనే వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.