ఫుకెట్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కుదుపులు.. ప్రయాణికులకు గాయాలు

Air India Phuket Delhi flight turbulence 12 passengers injured
  • ఇద్దరు సిబ్బంది సహా 12 మందికి స్వల్ప గాయాలు
  • ఒక్కసారిగా ఎత్తు తగ్గడంతో పైకప్పుకు తగిలిన ప్రయాణికులు
  • ఘటనను ధ్రువీకరించిన ఎయిరిండియా, ప్రయాణికులు సురక్షితం
  • గాయపడిన వారిని ఎయిర్‌పోర్టులోనే వైద్య కేంద్రానికి తరలింపు
ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. థాయ్ లాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం గగనతలంలో ఉన్న సమయంలో తీవ్రమైన కుదుపులకు (ఎయిర్ టర్బులెన్స్) లోనైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమాన సిబ్బందితో సహా మొత్తం 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో విమానానికి కూడా స్వల్ప నష్టం వాటిల్లినట్లు సమాచారం.

మంగళవారం 134 మంది ప్రయాణికులతో ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఏఐ-379 విమానం, గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో వాతావరణం మార్పుల కారణంగా ఒక్కసారిగా కుదుపులకు లోనై ఎత్తు తగ్గింది. ఈ విషయాన్ని ఎయిరిండియా సంస్థ ఒక ప్రకటనలో అధికారికంగా ధ్రువీకరించింది.

విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో కొందరు ప్రయాణికులు తమ సీట్ల నుంచి పైకి ఎగిరి విమానం పైకప్పును ఢీకొట్టారు. "విమానం హఠాత్తుగా కిందకు పడిపోయినట్లు అనిపించింది. నా తల పైకప్పుకు తగలడంతో కిందపడిపోయాను" అని ఒక ప్రయాణికుడు తన అనుభవాన్ని వివరించారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

అనంతరం విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిరిండియా వెల్లడించింది. గాయపడిన ప్రయాణికులను, సిబ్బందిని వెంటనే విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్పష్టం చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ తొలి ప్రాధాన్యమని, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎయిరిండియా వివరించింది.
Advertisement
Air India
Phuket Delhi flight
Severe turbulence
Air India flight injuries
AI379 flight

More Telugu News