డ్వాక్రా మహిళలకు భారీ ఊరట.. రుణాలపై కీలక ఛార్జీలు రద్దు చేసిన ఏపీ గ్రామీణ బ్యాంకు

Big relief for DWCRA women as AP Grameena Bank cancels key charges on loans
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డ్వాక్రా రుణాలపై కీలక నిర్ణయం
  • ఏపీ గ్రామీణ బ్యాంకులో పలు సేవా ఛార్జీలను పూర్తిగా రద్దు
  • 30 లక్షల మంది మహిళలకు ఏటా రూ. 500 కోట్ల లబ్ధి అంచనా
  • రూ. 5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీ రేటును 13% నుంచి 12%కి తగ్గింపు
  • ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటలో నడవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై పలు రకాల సేవా ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకు పరిధిలోని సుమారు 30 లక్షల మంది మహిళలకు ఏటా రూ. 500 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరుతుందని అంచనా. జులై 1 నుంచి తీసుకున్న రుణాలకు ఈ రద్దు వర్తిస్తుంది.

గతంలో డ్వాక్రా సంఘాల రుణాలపై బ్యాంకులు రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేసేవి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), యూనియన్ బ్యాంకులు ప్రాసెసింగ్, తనిఖీ ఫీజులను నిలిపివేయగా, తాజాగా వాటి సరసన ఏపీ గ్రామీణ బ్యాంకు చేరింది. ఈ నిర్ణయంతో ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌స్పెక్షన్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, లెడ్జర్ ఫోలియో ఛార్జీలు, పాస్‌బుక్ అప్‌డేట్ ఫీజులు, ఎస్‌హెచ్‌జీ స్టేట్‌మెంట్ ప్రింటింగ్, నగదు నిర్వహణ ఛార్జీలు వంటివి పూర్తిగా రద్దయ్యాయి.

దీంతో పాటు రూ. 5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీ రేటును 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. గతంలో రుణ మొత్తంతో సంబంధం లేకుండా 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉండేది. ఉదాహరణకు, రూ. 20 లక్షల రుణం తీసుకున్న బృందానికి ప్రాసెసింగ్ ఫీజు రద్దుతోనే ఏటా రూ. 10,000 ఆదా అవుతుంది. వడ్డీ రేటు తగ్గింపుతో మరో రూ. 15,000 వరకు ప్రయోజనం కలుగుతుంది. ప్రతి మూడు నెలలకోసారి విధించే తనిఖీ ఫీజులు, ఇతర ఛార్జీల రూపంలో గతంలో ఏటా రూ. 10,000 వరకు భారం పడేది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల డ్వాక్రా సంఘాలలో 1.10 కోట్ల మంది సభ్యులు ఉండగా, ఒక్క ఏపీ గ్రామీణ బ్యాంకు పరిధిలోనే సుమారు 3 లక్షల సంఘాలు, 30 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయం లక్షలాది కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చనుంది.

ఇతర బ్యాంకులూ అనుసరించాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఏపీ గ్రామీణ బ్యాంకు నిర్ణయాన్ని సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వాగతించారు. "డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలపై వేస్తున్న సేవా ఛార్జీలను ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, గ్రామీణ బ్యాంకులు నిలిపేస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఇతర బ్యాంకులు కూడా ఇదే తరహాలో రద్దు చేసి మహిళా సాధికారతకు తమ వంతు సహకారం అందించాలి. మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడంలో భాగంగా వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే సీఎం చంద్రబాబు బ్యాంకులను సంప్రదిస్తూ సేవా ఛార్జీలను మాఫీ చేయిస్తున్నారు" అని ఆయన తెలిపారు. గతంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ డ్వాక్రా రుణాలపై సుమారు 15 రకాల ఛార్జీలు విధిస్తున్నారని, వాటిని తగ్గించాలని సీఎం బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే.
Advertisement
Andhra Pradesh Grameena Bank
DWCRA Women Loans
Chandrababu Naidu
Andhra Pradesh
Loan Service Charges Waiver
Women Empowerment AP

More Telugu News