మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత
- కొల్హాపూర్ లో తుదిశ్వాస విడిచిన డీవై పాటిల్
- వయోభారం వల్ల ఎదురైన అనారోగ్య సమస్యలతో కన్నుమూత
- దేశ విద్యారంగానికి విశేష సేవలు
త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూశారు. వయోభారం వల్ల ఎదురైన ఆరోగ్య సమస్యలతో మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. విద్య, వైద్యం, ప్రజాసేవా రంగాలలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు.
1935 అక్టోబర్ 22న జన్మించిన డీవై పాటిల్ దేశ విద్యా రంగానికి విశేష సేవలందించారు. ఆయన స్థాపించిన ‘డీవై పాటిల్ గ్రూప్’ ఆధ్వర్యంలో భారతదేశమంతటా 182కి పైగా విద్యా సంస్థలు, 7 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి.
మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, 2009 నుండి 2013 వరకు త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా సేవలందించారు. విద్యా, సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషికి గానూ 1991లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది.