రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రగతి నివేదిక.. గత పాలనపై తీవ్ర విమర్శలు

CM Chandrababu releases progress report on two years of governance and slams past rule
  • రెండేళ్ల పాలనపై ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రొగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసిన సీఎం
  • 2019-24 మధ్య గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శ
  • నిశ్శబ్ద విప్లవంతో ప్రజలు 57 శాతం ఓట్లతో తమను గెలిపించారని వెల్లడి
  • గత పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ.. పారిశ్రామికవేత్తలు పారిపోయారని ఆరోపణ
  • ఉత్తరాంధ్రలో ఇరిగేషన్, స్టీల్, ఐటీ, ఫార్మా రంగాలను అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ
తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 'ప్రొగ్రెస్ రిపోర్ట్'ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య కాలంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, దాని ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ అణచివేత, వేధింపుల కారణంగానే ప్రజలు నిశ్శబ్ద విప్లవం ద్వారా తమకు చారిత్రాత్మక విజయాన్ని అందించారని చంద్రబాబు అన్నారు. "మా కూటమికి 57 శాతం ఓట్లు, 94 శాతం స్ట్రైక్ రేటుతో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఏడు కీలక శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచాం. ఇప్పుడు రెండేళ్ల పాలన తర్వాత ఆర్థిక స్థితిగతులపై ఈ ప్రగతి నివేదిక ఇస్తున్నాం" అని ఆయన తెలిపారు.

2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో కేవలం విధ్వంసమే జరిగిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. "అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రజలు, అధికారులు, చివరకు పోలీసులు కూడా భయంతో బతికే పరిస్థితిని కల్పించారు. ఏపీ బ్రాండ్‌ను దారుణంగా దెబ్బతీయడంతో ఇతర ప్రాంతాల్లో ఏపీ వాసులను చిన్నచూపు చూసే దుస్థితి ఏర్పడింది. పారిశ్రామికవేత్తలు తమ కంపెనీలను ఇక్కడ పెట్టబోమని చెప్పి పారిపోయిన పరిస్థితులను చూశాం" అని ఆయన ఆరోపించారు.

2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేకుండా, బస్సులో బస చేసి పాలన సాగించామని గుర్తుచేశారు. ఆ నష్టాల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే, గత ఐదేళ్లలో అంతకుమించిన నష్టం జరిగిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నామని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్, స్టీల్, ఏఐ, ఐటీ, ఫార్మా వంటి కీలక రంగాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Progress Report
TDP Janasena BJP Alliance
AP Economic Condition
Andhra Pradesh Development
AP White Papers

More Telugu News