రాత్రి భోజనం ఆలస్యమవుతోందా? ఈ ప్రమాదాల గురించి తెలుసా!

Late night dinner health risks and side effects you should know
  • ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి చేటు
  • శరీర జీవ గడియారంతో జీర్ణక్రియ ప్రభావితం
  • తిన్న వెంటనే పడుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదం
  • దీర్ఘకాలంలో మధుమేహం, ఊబకాయం ముప్పు
  • నిద్రకు 2-3 గంటల ముందే భోజనం మంచిది
  • రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవాలని వైద్యుల సూచన
ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంపై చాలా మంది శ్రద్ధ చూపుతారు. కానీ రాత్రి భోజనం మాత్రం పని పూర్తయ్యాక ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడే చేస్తుంటారు. కొందరైతే తిన్న వెంటనే పడుకుంటారు. ఇది సాధారణ అలవాటులా అనిపించినా.. జీర్ణక్రియ నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భోజనం ఏది తింటున్నామన్నది ఎంత ముఖ్యమో.. ఎప్పుడు తింటున్నామన్నది కూడా అంతే కీలకమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

మన శరీరానికీ ఓ గడియారం
మన శరీరం జీవ గడియారం ప్రకారం పనిచేస్తుంది. పగలు ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియ చురుగ్గా ఉంటుంది. రాత్రి సమయం దగ్గరపడే కొద్దీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఎందుకంటే శరీరం నిద్రకు సిద్ధమవుతుంది. అలాంటి సమయంలో ఎక్కువ తింటే జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది.

తిన్న వెంటనే పడుకుంటే సమస్యలు
రాత్రి ఆలస్యంగా భోజనం చేసి వెంటనే పడుకుంటే కడుపులోని ఆమ్లం ఆహారనాళంలోకి చేరే అవకాశం పెరుగుతుంది. దీంతో గుండెలో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇది తరచూ జరిగితే దీర్ఘకాలిక యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ పూర్తికాకపోవడంతో నిద్ర కూడా సరిగా పట్టదు.

కొన్ని సమస్యలు వెంటనే కనిపించవు
ఒక్కరోజు ఆలస్యంగా భోజనం చేసినంత మాత్రాన పెద్ద సమస్యలు రావు. కానీ అదే అలవాటుగా మారితే క్రమంగా బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, టైప్-2 మధుమేహం, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. రాత్రి సమయంలో శరీరం గ్లూకోజ్, కొవ్వును సమర్థంగా వినియోగించలేకపోవడం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు.

ఎప్పుడు భోజనం చేయాలి?
రాత్రి తప్పనిసరిగా ఏడు గంటలకే భోజనం చేయాలనే నిబంధన లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే నిద్రపోయే సమయానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే భోజనం పూర్తి చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఆలస్యమైతే నూనె, వేయించిన పదార్థాలు, తీపి పదార్థాల కంటే కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న ప్రొటీన్, తృణధాన్యాలతో కూడిన తేలికపాటి భోజనం తీసుకోవాలని సూచిస్తున్నారు.

అందరికీ ఒకే నియమం కాదు
రాత్రి విధులు చేసే ఉద్యోగులు, వైద్యులు, షిఫ్ట్‌లలో పనిచేసేవాళ్లకు ముందుగానే భోజనం చేయడం కుదరకపోవచ్చు. అలాంటి వారి పరిస్థితి వేరు. అయినా నిద్రకు ముందు భారమైన భోజనం చేయకుండా ఉండటం, జీర్ణక్రియకు తగిన సమయం ఇవ్వడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
Late night dinner
Health risks
Digestion issues
Acid reflux
Weight gain
Heart health

More Telugu News