మహారాష్ట్ర స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం

Maharashtra Government bans junk food sales in schools across the state
  • రెండు కోట్ల మంది విద్యార్థుల ఆరోగ్యంపై కీలక నిర్ణయం
  • స్కూల్ క్యాంటీన్లకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
  • పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలోనూ అమ్మకాలు బంద్
మహారాష్ట్రలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా విద్యార్థులపై ప్రభావం చూపేలా, స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. పాఠశాల ప్రాంగణాలతో పాటు, స్కూళ్లకు 50 మీటర్ల పరిధిలో కూడా జంక్ ఫుడ్, చక్కెర ఉత్పత్తులు, కెఫిన్ పానీయాల అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) జులై 28న ఆదేశాలు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, స్కూళ్లలో క్యాంటీన్లను నడపాలంటే ఇకపై తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. ఒకవేళ స్కూల్ యాజమాన్యమే క్యాంటీన్‌ను నడపాలనుకుంటే, వారు కూడా ఎఫ్‌డీఏ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుందని FDA కమిషనర్ రాజేశ్ నార్వేకర్ ముంధే స్పష్టం చేశారు. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు (హెచ్ఎఫ్ఎస్ఎస్) ఉన్న ఆహార పదార్థాల అమ్మకాలు, ప్రచారం, ఉచిత పంపిణీని స్కూళ్లలో, వాటి పరిసరాల్లో నిషేధించినట్లు ఆయన తెలిపారు.

ఈ ఆదేశాల ప్రకారం, ప్రాసెస్ చేసిన అనారోగ్యకరమైన వడాపావ్, ఐస్‌క్రీమ్‌లు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని అమ్మడానికి వీల్లేదు. ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బోర్డుల స్కూళ్లకు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలను పర్యవేక్షించేందుకు ఎఫ్‌డీఏ అధికారులు సంవత్సరానికి రెండుసార్లు ప్రతి స్కూల్‌ను తనిఖీ చేస్తారు. యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే, స్కూల్ అఫిలియేషన్ రద్దు చేయాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని ముంధే హెచ్చరించారు.

పెరుగుతున్న వయసులో పిల్లలకు ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం చాలా అవసరమని, వారి శారీరక, మానసిక వికాసానికి ఇది ఎంతో కీలకమని ముంధే వివరించారు. ఈ లక్ష్యంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో స్కూల్ ప్రిన్సిపాల్స్ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లలను అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Advertisement
Maharashtra Government
Junk food ban in schools
Maharashtra school canteen rules
FDA Maharashtra guidelines
Student health and nutrition
Rajesh Narvekar Mundhe

More Telugu News