వండితే పనీర్‌లో ప్రొటీన్‌ తగ్గుతుందా? నిపుణులు చెబుతున్న నిజాలు!

Does protein in paneer decrease when cooked Facts revealed by experts
  • 100 గ్రాముల పనీర్‌లో 18-21 గ్రాముల ప్రొటీన్‌
  • పచ్చి, వండిన పనీర్‌లో ఒకే స్థాయిలో ప్రొటీన్‌
  • తేమ తగ్గడంతో వండిన పనీర్‌లో సాంద్రత ఎక్కువ
  • డీప్‌ ఫ్రై చేస్తే పెరిగే క్యాలరీలు, కొవ్వు
  • లైట్‌గా వండితేనే పోషకాలు నిలుస్తాయి
పనీర్‌ అంటేనే ప్రొటీన్‌కు మంచి మూలం అని చాలామందికి తెలుసు. కానీ పచ్చి పనీర్‌ తింటేనే ఎక్కువ ప్రొటీన్‌ అందుతుందని, వండితే అది తగ్గిపోతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇందులో పూర్తి నిజం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పనీర్‌ను ఎలా వండుతున్నామన్నదే పోషక విలువలపై ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు.

100 గ్రాముల పనీర్‌లో సగటున 18 నుంచి 21 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. శరీరం స్వయంగా తయారు చేసుకోలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి. కాల్షియంతో పాటు మరెన్నో పోషకాలు ఉండటం వల్ల శాకాహారులకు ఇది ఉత్తమ ప్రొటీన్‌ ఆహారంగా భావిస్తారు.

పనీర్‌ను వండితే అందులోని తేమ తగ్గుతుంది. దీంతో ప్రొటీన్‌ సాంద్రత కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే వంటలో నూనె లేదా నెయ్యి వాడటం వల్ల క్యాలరీలు కూడా పెరుగుతాయి. మరోవైపు పచ్చి పనీర్‌లో క్యాలరీలతో పోలిస్తే ప్రొటీన్‌ నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది.

పనీర్‌ను ఆవిరిలో ఉడికించడం, గ్రిల్‌ చేయడం లేదా తక్కువ నూనెలో స్వల్పంగా వేయించడం వల్ల ప్రొటీన్‌ పరిమాణంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఎక్కువసేపు అధిక మంటపై వండడం లేదా డీప్‌ ఫ్రై చేయడం వల్ల కొవ్వు, క్యాలరీలు పెరుగుతాయి. అందుకే పనీర్‌ను ఎక్కువసేపు ఉడికించకుండా చివర్లో కూరలో వేయడం మంచిదని సూచిస్తున్నారు.

పనీర్‌లోని ప్రొటీన్‌ను కాపాడుకోవాలంటే డీప్‌ ఫ్రై చేయకుండా స్వల్పంగా వేయించాలి. మైక్రోవేవ్‌లో 20-30 సెకన్లు వేడి చేస్తే సరిపోతుంది. కూరలో చివర్లో పనీర్‌ ముక్కలు వేయాలి. తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలతో కలిపి తినాలి.
Advertisement
Paneer
Protein content in paneer
Paneer nutrition facts
Healthy cooking tips
Vegetarian protein sources
Raw vs cooked paneer

More Telugu News