మీరు పార్టీ చేసుకున్నారు.. ఆందోళనకారులు ఆకలితో అలమటించారు: సీజేపీ నాయకుల డాన్స్ వీడియోలపై తీవ్ర ఆగ్రహం!
- విద్యార్థి ఉద్యమం ముగిసిన వేళ చెలరేగిన కొత్త వివాదం
- పార్టీలు చేసుకుంటూ డ్యాన్సులు చేసిన సీజేపీ ముఖ్య నేతలు
- తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నిరసనకారులు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల వ్యవహారంపై నెల రోజులకు పైగా సాగిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) విద్యార్థి ఉద్యమం ఇటీవల ముగిసిన వేళ కొత్త వివాదం చెలరేగింది. ఒకవైపు సాధారణ విద్యార్థులు ఆకలితో, పోలీసు దెబ్బలతో అలమటిస్తుంటే... మరోవైపు సీజేపీ ముఖ్య నాయకులు మాత్రం పార్టీలు చేసుకుంటూ, డాన్సులు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వారిపై నెటిజన్లు, నిరసనకారులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
జంతర్ మంతర్ వద్ద నెల రోజులకు పైగా సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో విద్యార్థులు తిండి, నిద్ర లేకుండా ఎండనక, వాననక ఆందోళనలు చేపట్టారు. చివరికి విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆందోళనను ఉపసంహరించుకున్నారు. అయితే ఉద్యమం విజయవంతమైందనే నెపంతో సీజేపీ ముఖ్య నాయకులు, ప్యానెలిస్టులు కలిసి ప్రైవేట్ పార్టీలు చేసుకుంటూ మందు కొడుతూ, డాన్సులు వేస్తున్న వీడియోలు నెట్‌లో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలపై ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు నాయకులు తమ స్వార్థం కోసం విద్యార్థుల కష్టాన్ని, త్యాగాలను వాడుకున్నారని, ఒకవైపు క్షేత్రస్థాయిలో విద్యార్థులకు భోజనాలు కూడా అందక ఆకలితో అలమటించిన పరిస్థితులు ఉంటే, వీరు మాత్రం పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేయడం దారుణమని మండిపడుతున్నారు. అసలు విద్యార్థుల సమస్యల కోసం వీరు పోరాడలేదని, మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఈ నాటకాలన్నీ ఆడారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.