రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే.. వారంలో కిలో బరువు తగ్గొచ్చు?

Weight loss tips how many steps to walk to lose one kg per week
  • కిలో బరువు తగ్గాలంటే 7,700 క్యాలరీల లోటు అవసరం అంటున్న నిపుణులు
  • రోజుకు 22,000-27,500 అడుగులు అవసరం
  • నడకతోనే లక్ష్యం చేరడం కష్టం
  • ఆహార నియంత్రణ కూడా తోడైతే ఫలితం
  • రోజుకు 12-15 వేల అడుగులతోనూ ఫలితం
  • వేగంగా, క్రమంగా నడవాలని నిపుణుల సూచన
బరువు తగ్గాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా నడక అలవాటు చేసుకున్నా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే వారంలో ఒక కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎంత నడవాలి? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి సమాధానం మాత్రం అందరి అంచనాలకు మించి ఉంటుంది.

శరీరంలోని ఓ కిలో కొవ్వు తగ్గాలంటే సుమారు 7,700 క్యాలరీల లోటు అవసరం. అంటే వారంలో ఒక కిలో బరువు తగ్గాలంటే రోజుకు దాదాపు 1,100 క్యాలరీలు ఖర్చు చేయాలి. సాధారణంగా వెయ్యి అడుగులు నడిస్తే 40 నుంచి 50 క్యాలరీలు ఖర్చవుతాయి. ఈ లెక్కన నడకతోనే వారంలో ఒక కిలో తగ్గాలంటే రోజుకు 22 వేల నుంచి 27,500 అడుగులు వేయాల్సి ఉంటుంది. వారానికి మొత్తం 1.54 లక్షల నుంచి 1.92 లక్షల అడుగులు నడవాల్సి వస్తుంది.

అయితే నిపుణులు ఈ లక్ష్యాన్ని ఆచరణలో అంత సులభం కాదని చెబుతున్నారు. రోజూ 22 వేలకుపైగా అడుగులు నడిస్తే కీళ్లపై ఒత్తిడి పెరగొచ్చు. కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆ అలవాటును ఎక్కువ రోజులు కొనసాగించడం కష్టమవుతుంది. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు ఒక్కో అడుగుతో మరిన్ని క్యాలరీలు ఖర్చు చేస్తారు. వేగంగా నడిస్తే క్యాలరీల వినియోగం కూడా పెరుగుతుంది.

బరువు తగ్గాలంటే నడకతో పాటు ఆహార నియంత్రణ కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో సుమారు 500 క్యాలరీలు తగ్గిస్తే, రోజుకు 12 వేల నుంచి 15 వేల అడుగులు నడిచినా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఒక్కసారిగా ఎక్కువ దూరం నడవకుండా, క్రమంగా అడుగుల సంఖ్య పెంచుకోవాలి. వేగంగా నడవడం, ఎత్తైన ప్రాంతాల్లో నడక, రోజుకు మూడు విడతల్లో 20 నిమిషాల చొప్పున నడవడం, తగినంత నీరు తాగడం, రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం కూడా బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి.
Advertisement
Weight Loss
Walking for weight loss
Daily steps to lose weight
Burn calories by walking
Fitness and diet tips
Health benefits of walking

More Telugu News