Advertisement

అశ్లీల కంటెంట్‌పై కేంద్రం ఉక్కుపాదం.. మరో 50 ఓటీటీ యాప్‌లపై నిషేధం!

Central Government bans 50 OTT apps for hosting vulgar content
  • అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను అరికట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకున్న కేంద్రం
  • 50 ఓటీటీల యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేసిన వైనం
  • గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశం

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. సమాజానికి హానికరం కలిగించేలా అసభ్యకర దృశ్యాలను ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ యాప్‌లను దేశవ్యాప్తంగా బ్లాక్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. గతేడాది 25, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 5 యాప్‌లపై చర్యలు తీసుకున్న కేంద్రం, తాజాగా మరిన్ని యాప్‌లపై ఉక్కుపాదం మోపడం గమనార్హం.


కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, చట్టాలను ఉల్లంఘించే యాప్‌లపై ఎలాంటి దాక్షిణ్యం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కఠిన చట్టాల కింద చర్యలు:

సమాచార సాంకేతిక (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021 ప్రకారం ఈ యాప్‌లపై చర్యలు తీసుకున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లలోని కంటెంట్ భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 294తో పాటు మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధ) చట్టంలోని సెక్షన్ 4కు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వ్యూస్, సబ్‌స్క్రిప్షన్ల ఆదాయం కోసమే ఇలాంటి అశ్లీల దృశ్యాలను ప్రోత్సహిస్తున్నట్లు తేలడంతో వీటి యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేశారు.


నిషేధిత యాప్‌ల జాబితాను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినప్పటికీ, వినియోగదారులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోకుండా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ల నుంచి తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) కూడా వీటి యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం కోర్టు లేదా ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన కేవలం 3 గంటల్లోపే సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
Advertisement
Central Government
OTT App Ban
Obscene Content
Information and Broadcasting Ministry
IT Rules 2021
Digital Media

More Telugu News