బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా, భోజ్‌పురి సూపర్‌స్టార్ కేసరి లాల్ యాదవ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ ఈవెంట్‌లో కేసరి లాల్ సమక్షంలో వీధి కుక్క పట్ల అమానవీయంగా ప్రవర్తించిన వీడియోపై ఆమె మండిపడ్డారు. ఈ ఘటన చాలా అసహ్యంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

వివరాల్లోకి వెళితే, ఓ ఈవెంట్‌లో కేసరి లాల్ యాదవ్ ఫోటోలకు పోజులిస్తుండగా, అతని కాళ్ల దగ్గర ఓ వీధి కుక్క ప్రశాంతంగా పడుకుని ఉంది. ఫోటో సెషన్‌కు అడ్డుగా ఉందని భావించిన కేసరి, మొదట దాన్ని పంపించేందుకు సైగలు చేశాడు. అది కదలకపోవడంతో, ఓ సహాయకుడు వచ్చి తన కాలితో కుక్కను నెట్టి, అక్కడి నుంచి పక్కకు లాగేశాడు. అయితే, ఆ కుక్క మాత్రం తనను ప్రేమగా నిమురుతున్నారని భావించి, కడుపుపై నిమరమని అడుగుతూ నేలపై దొర్లడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన మలైకా, "వీళ్లేం మనుషులు అసలు? అక్కడ నిలబడి పోజులిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? చాలా అసహ్యంగా ఉంది" అంటూ ఘాటుగా పోస్ట్ పెట్టారు. ఆమె నేరుగా కేసరి లాల్‌ను నిందించనప్పటికీ, ఆ ఘటన పట్ల తనకున్న తీవ్ర అసంతృప్తిని స్పష్టం చేశారు.

జంతు ప్రేమికురాలిగా మలైకాకు మంచి పేరుంది. ఆమె తరచుగా వీధి కుక్కలతో ఆడుకుంటూ, వాటికి ఆహారం అందిస్తూ కనిపిస్తుంటారు. అలాంటిది ఈ వీడియో చూడటంతో ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మొత్తం వివాదంపై భోజ్‌పురి నటుడు కేసరి లాల్ యాదవ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, స్పందించలేదు.