వర్షాలు, వరదలతో అసోం విలవిల: 41కి చేరిన మృతుల సంఖ్య
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన నదులు
- తీవ్రంగా ప్రభావితమైన 6.53 లక్షల మంది ప్రజలు
- ముంపుకు గురైన 939 గ్రామాలు
అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాద హెచ్చరిక స్థాయులను దాటి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలో వరద పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వేలాది మంది ఇళ్లను వదిలి దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం... గడిచిన 24 గంటల్లోనే నలుగురు చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల కారణంగా సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 41కి చేరుకుంది.
తాజా మరణాల్లో శివసాగర్ జిల్లాలో ముగ్గురు, జోర్హాట్‌లో ముగ్గురు, చరైడియో జిల్లాలో ఇద్దరు, ధేమాజీ, కర్బీ అంగ్లాంగ్ జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మరో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం ఆరుగురు వరద నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లోని 40 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని దాదాపు 939 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తం 6.53 లక్షలకు పైగా ప్రజలు ఈ వరదల దాటికి తీవ్రంగా ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర నదితో పాటు దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. నంగ్లామురాఘాట్ వద్ద 'దిసాంగ్' నది తన ఆల్-టైమ్ రికార్డు స్థాయి ప్రమాదకర మట్టాన్ని దాటి ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే బుర్హిదిహింగ్, దిఖౌ, ధన్సిరి, కుషియారా నదులు కూడా ప్రమాదకర హెచ్చరిక స్థాయులను దాటి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.
బాధిత జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 487 రిలీఫ్ క్యాంపులు, పంపిణీ కేంద్రాలలో దాదాపు 3.13 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు 1.38 లక్షలకు పైగా మూగజీవాలు కూడా ఈ వరదల వల్ల ప్రభావితమయ్యాయి. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వాయుసేన, ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి ఒక్కరోజే 8,400 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరద ధాటికి 53 రోడ్లు, 6 కట్టలు పూర్తిగా ధ్వంసమై రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.