Advertisement

గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా? సైన్స్‌ ఏం చెబుతోందంటే..!

Eggs storage myths about taste and nutrition facts
  • గుడ్ల భద్రతలో ఉష్ణోగ్రత కీలకం
  • ఫ్రిజ్‌లో బ్యాక్టీరియా పెరుగుదల తగ్గే అవకాశం
  • అమెరికాలో గుడ్లు కడిగి విక్రయించే అలవాటు
  • అందుకే అక్కడ ఫ్రిజ్‌ తప్పనిసరి
  • భారత్‌లో ఫ్రిజ్‌లో ఉంచడం మంచిదంటున్న నిపుణులు
  • ఫ్రిజ్‌ డోర్‌లో కాకుండా షెల్ఫ్‌లో ఉంచడం మేలు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి రాత్రి భోజనం వరకు గుడ్లు చాలా మంది ఆహారంలో భాగమయ్యాయి. అయితే ఒక సందేహం మాత్రం ఎప్పుడూ ఉంటుంది.. గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టాలా? లేక బయట ఉంచినా సరిపోతుందా? కొందరు ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే నిల్వ చేస్తే.. మరికొందరు గది ఉష్ణోగ్రతలో ఉంచుతారు. మరి ఇందులో సరైన పద్ధతి ఏది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

2021లో ‘ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గుడ్లను 25 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో కొన్ని రోజులు ఉంచితే సాల్మొనెల్లా టైఫిమ్యూరియం అనే బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంది. అదే ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆ బ్యాక్టీరియా పెరుగుదల గణనీయంగా తగ్గుతుంది. అంటే గుడ్ల భద్రత, తాజాగా ఉండటంలో ఉష్ణోగ్రత కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

కొన్ని దేశాల్లో తప్పనిసరి?
అమెరికా వంటి దేశాల్లో మార్కెట్‌లోకి వచ్చే ముందు గుడ్లను ప్రత్యేకంగా కడిగి శుభ్రం చేస్తారు. దీంతో వాటి పెంకుపై ఉండే సహజ రక్షణ పొర (క్యూటికల్‌) తొలగిపోతుంది. అది లేకపోవడంతో బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించే ప్రమాదం పెరుగుతుంది. అందుకే అక్కడ గుడ్లను 4 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాలని అమెరికా వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

యూరప్‌, ఆసియా దేశాల్లో పరిస్థితి భిన్నం
యూరప్‌, ఆసియాలోని చాలా దేశాల్లో గుడ్లను కడగకుండా విక్రయిస్తారు. దీంతో వాటి సహజ రక్షణ పొర అలాగే ఉంటుంది. అందువల్ల సాధారణంగా ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే చల్లని, పొడి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. భారత్‌ వంటి వేడి, తేమ ఎక్కువగా ఉండే దేశాల్లో మాత్రం ఫ్రిజ్‌లో ఉంచితే గుడ్లు ఎక్కువకాలం తాజాగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించేది ఫ్రిజ్‌
ఎక్కువ ఉష్ణోగ్రతలో సాల్మొనెల్లా ఎంటెరిటిడిస్ వంటి బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఈ పెరుగుదల మందగిస్తుంది. అయితే తరచూ ఫ్రిజ్‌లో పెట్టడం, బయటకు తీయడం మంచిది కాదు. ఇలా చేస్తే గుడ్లపై తేమ ఏర్పడి బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఒకే ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం అత్యంత ముఖ్యం.

ఇంట్లో గుడ్లను ఎలా నిల్వ చేయాలి?
సూపర్‌మార్కెట్‌లో ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లను కొనుగోలు చేస్తే ఇంటికొచ్చిన తర్వాత కూడా ఫ్రిజ్‌లోనే పెట్టాలి. వాటిని ఫ్రిజ్‌ డోర్‌లో కాకుండా లోపలి షెల్ఫ్‌లో అసలు కార్టన్‌తోనే ఉంచడం మంచిది. ఎందుకంటే డోర్‌ తరచూ తెరవడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది.

స్థానికంగా లభించే కడగని గుడ్లను చల్లని వాతావరణంలో వారం రోజుల వరకు బయట ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది.

ఫ్రిజ్‌లో పెడితే రుచి మారుతుందా?
గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచితే వాటి రుచి లేదా పోషక విలువలు మారిపోతాయనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల గుడ్లు ఎక్కువకాలం తాజాగా ఉండటమే తప్ప వాటి రుచి లేదా పోషకాలు తగ్గవని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
Eggs
Salmonella bacteria
Egg storage tips
Food safety
Refrigeration science
Fresh eggs

More Telugu News