అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలోనే ఓ ఉన్మాది రంపంతో బాలికపై దాడికి పాల్పడటం అత్యంత దారుణమని అన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆయన అధికారులతో మాట్లాడారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని, ఆమెకు అందుతున్న చికిత్స వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.