కాఫీ తాగితే గుండెకు హాని జరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మరోవైపు ఎనర్జీ డ్రింక్స్ తాగితే వెంటనే శక్తి వస్తుందని యువత ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే రెండింటిలోనూ కెఫిన్ ఉన్నప్పటికీ.. శరీరంపై వీటి ప్రభావం ఒకేలా ఉండదని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ జర్నల్ ‘సర్క్యులేషన్‌’లో ప్రచురితమైన శాస్త్రీయ నివేదిక ప్రకారం.. పరిమిత మోతాదులో కాఫీ తాగడం గుండె ఆరోగ్యానికి మేలు చేసే అవకాశం ఉందని, కానీ ఎనర్జీ డ్రింక్స్ మాత్రం గుండెపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది.

అధ్యయనం ఏం చెబుతోంది?
రోజుకు గరిష్ఠంగా 400 మిల్లీగ్రాముల కెఫిన్‌ (సుమారు 4-5 కప్పుల సాధారణ బ్లాక్ కాఫీ) తీసుకోవడం చాలా మంది ఆరోగ్యవంతులైన పెద్దలకు సురక్షితమని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా పరిమితంగా కాఫీ తాగే వారిలో గుండెజబ్బులు, స్ట్రోక్‌, గుండె వైఫల్యం, టైప్-2 మధుమేహం, కొన్ని రకాల గుండె లయ సమస్యల ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.

కాఫీ గుండెకు ఎందుకు మేలు?
కాఫీలో కెఫిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ వంటి వందలాది సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో సాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. చక్కెర, సిరప్‌, అధిక క్రీమ్ లేకుండా తాగే సాధారణ కాఫీ వల్లే ఈ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఎనర్జీ డ్రింక్స్ ఎందుకు ప్రమాదకరం?
ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్‌తో పాటు అధిక మోతాదులో చక్కెర, ఇతర ఉత్తేజక పదార్థాలు ఉంటాయి. ఇవి కలిసి గుండెపై అదనపు ఒత్తిడి పెంచుతాయి. దీంతో రక్తపోటు ఒక్కసారిగా పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె లయలో మార్పులు రావడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ముఖ్యంగా తక్కువ సమయంలో వరుసగా ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని పేర్కొంది.

కెఫిన్ ఒక్కటే కారణం కాదు
కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ రెండింటిలోనూ కెఫిన్ ఉన్నప్పటికీ.. ప్రభావం మాత్రం భిన్నంగా ఉంటుంది. కాఫీలో కెఫిన్ సహజంగా ఇతర ఆరోగ్యకరమైన సమ్మేళనాలతో కలిసి ఉంటుంది. కానీ ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక కెఫిన్‌తో పాటు చక్కెర, ఇతర స్టిమ్యులెంట్లు ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది.

కాఫీ రక్తపోటును పెంచుతుందా?
కాఫీ తాగిన వెంటనే కొంతమందిలో రక్తపోటు తాత్కాలికంగా పెరగొచ్చు. అయితే పరిమిత మోతాదులో కాఫీ తాగడం వల్ల సాధారణంగా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరగదని పరిశోధన తెలిపింది. అయితే ఇప్పటికే గుండె జబ్బులు, అదుపులో లేని రక్తపోటు ఉన్నవారు లేదా కెఫిన్‌కు సున్నితంగా స్పందించే వారు వైద్యుల సలహా మేరకే కాఫీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇందులోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ లేదా కెఫిన్ తీసుకునే విషయంలో తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.