బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (60) ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన తీరు ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన నీరసంగా, కాస్త అనారోగ్యంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సల్మాన్‌కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే, జూలై 18న ముంబైలోని స్లమ్ రీహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సల్మాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కొత్త డేటా సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు, పునరావాస పథకం కింద 50 మందికి పైగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశాడు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో సల్మాన్ ఎలాంటి ప్రత్యేక స్టైలింగ్ లేకుండా, చాలా సాధారణంగా కనిపించారు. ఎంతో ఫిట్ గా ఉండే సల్లూ దగ్గుతూ బలహీనంగా కనిపించాడు. దీంతో "భాయ్‌కి ఏమైంది?", "ఆయన అనారోగ్యంగా కనిపిస్తున్నారు, దేవుడు చల్లగా చూడాలి" అంటూ చాలా మంది ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు.

అయితే, ఇది కేవలం 60 ఏళ్ల వయసులో వచ్చే సహజ మార్పు మాత్రమేనని, ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఎన్డీటీవీ, లేటెస్ట్‌లీ కథనాల ప్రకారం, వరుస షూటింగ్‌లు, వర్కౌట్‌లతో అలసిపోవడం సహజమని, దీన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. సల్మాన్ ఆరోగ్యంపై ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక సినిమాల విషయానికొస్తే, సల్మాన్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'రాజా శివాజీ' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం అపూర్వ లఖియా దర్శకత్వంలో 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' అనే చిత్రంలో నటిస్తున్నారు.