స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా?.. యువత మెదళ్లను గుల్ల చేస్తున్న కొత్త జబ్బు!

Are you using smartphones too much A new disease is damaging the brains of youth
  • యువతలో పెరుగుతున్న 'స్మార్ట్‌ఫోన్ బ్రెయిన్' లక్షణాలు
  • నిరంతర నోటిఫికేషన్లతో విశ్రాంతి కరవవుతున్న మెదడు
  • బ్లూ లైట్ వల్ల నిద్రలేమి, తీవ్ర తలనొప్పి
  • మెడ, భుజాల నొప్పులతో 'టెక్స్ట్ నెక్' ముప్పు
  • రక్షణ కోసం '20-20-20' సూత్రాన్ని పాటించాలంటున్న వైద్యులు
ఒకప్పుడు పక్షవాతం, పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి తీవ్రమైన నరాల సమస్యలతో కేవలం వృద్ధులు మాత్రమే న్యూరాలజిస్టులను ఆశ్రయించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా లేని యువతీ యువకులు, కౌమారదశలో ఉన్న పిల్లలు సైతం తరచుగా తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, కళ్ళు తిరగడం, గందరగోళం వంటి సమస్యలతో క్లినిక్‌లకు క్యూ కడుతున్నారు. ఈ మార్పునకు కారణం స్మార్ట్‌ఫోన్ల మితిమీరిన వాడకమేనని వైద్యులు తేల్చి చెబుతున్నారు. దీనినే వారు 'స్మార్ట్‌ఫోన్ బ్రెయిన్' (డిజిటల్ అలసట)గా పేర్కొంటున్నారు.

విశ్రాంతి ఎరుగని మెదడు
నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు, ఎండ్ లెస్ స్క్రోలింగ్, ఒక యాప్ నుంచి మరో యాప్‌నకు క్షణాల్లో మారిపోవడం వల్ల మెదడు ఎప్పుడూ ఒక రకమైన తీవ్ర ఉత్తేజిత స్థితిలోనే ఉండిపోతుందని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ కృష్ణ జొన్నలగడ్డ వివరించారు. దీనివల్ల యువత ఒక పుస్తకం చదవాలన్నా, ఆఫీస్ మీటింగుల్లో కూర్చోవాలన్నా.. ప్రతి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారని, ఇది వారి ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నిద్రలేమి, తలనొప్పి, టెక్స్ట్ నెక్ ముప్పు
రాత్రిపూట ఆలస్యంగా ఫోన్లు వాడటం వల్ల స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్.. శరీరంలో నిద్రను నియంత్రించే 'మెలటోనిన్' హార్మోన్ విడుదలను అడ్డుకుంటుందని సీఎమ్ఆర్ఐ ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ దీప్ దాస్ తెలిపారు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, దీర్ఘకాలిక తలనొప్పులు వస్తాయని హెచ్చరించారు. గంటల తరబడి తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ, భుజాల కండరాలు దెబ్బతిని తీవ్రమైన మైగ్రేన్ నొప్పులకు దారితీస్తుందని, దీనినే 'టెక్స్ట్ నెక్' అంటారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల్లో ఇది నేర్చుకునే సామర్థ్యాన్ని, సామాజిక సంబంధాలను దెబ్బతీస్తుంది.

పరిష్కారం ఏంటి?
స్మార్ట్‌ఫోన్లు వాడటం తప్పు కాదని, కానీ వాటిని వాడే విధానంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం ప్రసిద్ధ '20-20-20' సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు. అంటే ప్రతి 20 నిమిషాల స్క్రీన్ సమయం తర్వాత, 20 సెకన్ల పాటు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి. పడుకోవడానికి గంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేయడం, కూర్చునే భంగిమను సరిచేసుకోవడం, వ్యాయామం చేయడం వంటి అలవాట్లతో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సమస్యలు తీవ్రంగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మేలని హెచ్చరిస్తున్నారు.
Advertisement
Smartphone
Smartphone Brain
Digital Fatigue
Brain Fog
Text Neck
Mental Health

More Telugu News