'బుల్లెట్ ట్రైన్‌'పై లడాయి.. భారత్‌పై జపాన్ మాజీ మంత్రి సంచలన ఆరోపణలు!

Hideki Makihara levels sensational allegations against India over Bullet Train project delay
  • భారత అధికారుల వల్లే బుల్లెట్ ట్రైన్ ఆలస్యమన్న హిడెకి మాకిహారా
  • జపాన్ మాజీ మంత్రి ఆరోపణలను ఖండించిన భారత విదేశాంగ శాఖ
  • సిగ్నలింగ్ వ్యవస్థపై కాంగ్రెస్ విమర్శలను కొట్టిపారేసిన కేంద్రం
  • సరికొత్త ఈ10 సిరీస్ రైళ్లు 2030 తర్వాతే రానున్నట్లు వెల్లడి
  • 2027 ఆగస్టు 15 నాటికి తొలి విడత బుల్లెట్ రైలు ప్రారంభం!
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చుట్టూ అంతర్జాతీయంగా ఒక కొత్త వివాదం రేగింది. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి భారత ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయాలు, పట్టువిడుపులు లేని వైఖరే కారణమంటూ జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడెకి మాకిహారా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. అయితే, భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా, పక్కాగా సాగుతున్నాయని స్పష్టం చేసింది.

ఇండియా వైపు అధికారులదే తప్పు: జపాన్ మాజీ మంత్రి
జపాన్‌కు చెందిన సీనియర్ రైల్వే ఇంజనీర్ ఇసావో సుజిమురా రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావిస్తూ "భారతదేశంలో షింకాన్సెన్ (బుల్లెట్ ట్రైన్) ప్రాజెక్టు చర్చల్లో నేను కూడా పాలుపంచుకున్నాను. అంతర్జాతీయ సమావేశాల్లో భారత అధికారుల మొండితనం స్పష్టంగా కనిపించేది. వారు ఇచ్చిన మాట అస్సలు నిలబెట్టుకోరు, వెంటనే మాట మారుస్తారు. తమ స్వప్రయోజనాల కోసమే చివరివరకు పట్టుబడతారు. ఈ ప్రాజెక్టు ఆలస్యమవడానికి నూటికి నూరు శాతం భారత అధికారులదే బాధ్యత" అని మాకిహారా ఆరోపించారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 2026 జులైలో జరిపిన భారత్ పర్యటన కూడా ఈ విషయంలో పెద్దగా పురోగతి సాధించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ దుమారం.. రంగంలోకి విదేశాంగ శాఖ
జపాన్ నేత చేసిన ఈ ఆరోపణలను అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అత్యంత కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి జపాన్‌ను భారత్ తప్పించిందని ఆయన ఆరోపించారు. ఈ వివాదంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ఆ ఆరోపణలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, క్షేత్రస్థాయి వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. సిగ్నలింగ్ పరికరాల కోసం అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే ఆర్డర్లు ఇచ్చామని, ఈ విషయంలో జపాన్ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు.

2027 లోనే బుల్లెట్ రైలు ప్రారంభం
జపాన్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో (జైకా రుణాలతో), వారి సాంకేతికతతోనే 508 కిలోమీటర్ల మేర ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. భూసేకరణ వంటి అడ్డంకులు దాటుకుని పనులు ఊపందుకున్నాయని, గుజరాత్‌లోని సూరత్ - బిలిమోరా మధ్య మొదటి విడత బుల్లెట్ రైలు సర్వీసులను 2027 ఆగస్టు 15 నాటికి పక్కాగా ప్రారంభిస్తామని విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే, జపాన్ అందిస్తున్న సరికొత్త ఈ10 సిరీస్ బుల్లెట్ రైళ్లు ప్రస్తుతం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయని, అవి 2030 ప్రారంభంలో భారత్‌కు అందుతాయని స్పష్టం చేసింది. అప్పటివరకు భారత్‌లోనే స్వదేశీ సాంకేతికతతో రైళ్లను సిద్ధం చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.
Advertisement
Hideki Makihara
Mumbai Ahmedabad Bullet Train
India Japan Railway Project
Ministry of External Affairs
Shinkansen Technology
Bullet Train Delay Allegations

More Telugu News