పుట్టినరోజున ఫ్యాన్స్‌కు ప్రియాంక ట్రీట్.. 'వారణాసి' నుంచి మందాకిని క్రేజీ లుక్!

Priyanka Chopra treat to fans on birthday Mandakini crazy look from Varanasi
  • మందాకిని పాత్రలో ఫెరోషియస్ అవతార్‌లో కనిపించిన గ్లోబల్ బ్యూటీ
  • రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబుతో కలిసి నటిస్తున్న ప్రియాంక
  • ప్రతినాయకుడి పాత్రలో క‌నిపించ‌నున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 
  • వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా 'వారణాసి' చిత్రం విడుదల
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'మందాకిని' అనే పాత్రలో ప్రియాంక చోప్రా ఫెరోషియస్ అవతార్‌లో కనిపించి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ 'వీక్లీ' ఈ ఫొటోలను ప్రత్యేకంగా పంచుకుంది.

ఈ ఫొటోలలో ప్రియాంక పూర్తి నలుపు రంగు దుస్తులలో, ఉంగరాల జుట్టుతో చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. ఒక భారీ యాక్షన్ సాంగ్‌లోని స్టిల్స్ ఇవని తెలుస్తోంది. చిత్రంలో ఆమె పోషిస్తున్న 'మందాకిని' పాత్రను "ప్రపంచవ్యాప్తంగా పర్యటించే ఒక ధైర్యవంతురాలు, శక్తిమంతమైన మహిళ. అదే సమయంలో సున్నితమైన భావోద్వేగాలు కలిగి, ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోయే పాత్ర" అని చిత్ర యూనిట్ వర్గాలు అభివర్ణించాయి. 

ఆస్కార్ విజేత 'RRR' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న పూర్తిస్థాయి ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ 'వారణాసి'. వేల సంవత్సరాల కాలంలో, పురాతన నాగరికతల నుంచి నేటి ఆధునిక యుగం వరకు సాగే ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో రూపొందుతోంది. అంటార్కిటికా, ఆఫ్రికా, పవిత్ర నగరం వారణాసి సహా పలు ఖండాలలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సరసన నటిస్తున్నారు. మహేశ్‌ 'రుద్ర' అనే పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా రామాయణ యుద్ధ ఘట్టాలకు సంబంధించిన 20 నిమిషాల సన్నివేశంలో శ్రీరాముడి పాత్రలో కూడా మహేశ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో 'కుంభ' అనే ప్రధాన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. మహేశ్‌, పృథ్వీరాజ్ పాత్రల మధ్య నలిగిపోయే కీలకమైన పాత్రలో ప్రియాంక కనిపించనుంది.

2019లో వచ్చిన 'ది స్కై ఈజ్ పింక్' తర్వాత ప్రియాంక చోప్రా మళ్లీ భారతీయ థియేటర్లలోకి వస్తున్న సినిమా ఇదే. దాదాపు 14 నెలలుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నానని, ఇది ఒక అద్భుతమైన సాహసయాత్ర అని ప్రియాంక గతంలో తెలిపారు. "ఈ సినిమాలో నేను అద్భుతమైన స్లో-మోషన్ జంప్స్ చాలా చేశాను" అని ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ప్రియాంక ప్రత్యేకంగా కోరడంతో రాజమౌళి ఆమె, మహేశ్‌ బాబులపై ఒక భారీ డ్యాన్స్ నంబర్‌ను చిత్రీకరించినట్లు సమాచారం.

ఇప్పటికే పలు ప్రధాన యాక్షన్ సన్నివేశాలు, ఐమాక్స్ (IMAX) షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రియాంక పుట్టినరోజున ఈ లుక్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 'దేశీ గర్ల్' భారతీయ సినిమాలోకి పవర్‌ఫుల్‌గా పునరాగమనం చేస్తోందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Advertisement
Priyanka Chopra
Varanasi Movie
SS Rajamouli
Mahesh Babu
Mandakini First Look
Priyanka Chopra Birthday

More Telugu News