భోజనం చేస్తూ నీళ్లు తాగితే జీర్ణక్రియ దెబ్బతింటుందా?.. డాక్టర్‌ చెప్పిన అసలు నిజం

Drinking water during meals myths and facts about digestive health
  • నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుందన్నది అపోహ
  • కడుపులో సహజంగానే బలమైన ఆమ్లాలు ఉంటాయని వెల్లడి
  • జీర్ణక్రియ ప్రతిదశలో నీళ్లు చాలా అవసరమని వివరణ
  • పరిమితంగా నీళ్లు తాగితే ఆహారం సులభంగా కదులుతుందని వెల్లడి
  • ఎక్కువ తాగితే అసౌకర్యం కలగొచ్చని హెచ్చరిక
  • నీళ్లు తాగడంపై కాకుండా రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టాలని సూచన
భోజనం చేస్తూ నీళ్లు తాగొద్దని కొంత మంది చెబుతుండడం వినే ఉంటారు. అలా చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందని, కడుపులోని జీర్ణరసాలు పల్చబడతాయని చాలామంది నమ్ముతారు. కొందరు భోజనం పూర్తయ్యాకే నీళ్లు తాగుతారు. మరికొందరు అరగంట వరకూ అస్సలు తాగరు. అయితే ఈ నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? ఈ సందేహానికి డాక్టర్ల సమాధానం ఏంటో చూద్దాం..!

జీర్ణరసాలు పల్చబడవు
భోజనం చేస్తూ నీళ్లు తాగితే కడుపులోని జీర్ణరసాలు పల్చబడిపోతాయనేది అపోహ. కడుపులో సహజంగానే బలమైన ఆమ్లాలు ఉంటాయి. అవే ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. సాధారణంగా తాగే కొద్దిపాటి నీళ్లు ఈ ప్రక్రియను గణనీయంగా ప్రభావితం చేయవు.

జీర్ణక్రియకు నీళ్ల తోడ్పాటు
ఆహారం నమలడం, మింగడం, కడుపులో కలవడం, తర్వాత పేగుల్లోకి వెళ్లడం వంటి ప్రతి దశలో నీరు సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజన సమయంలో పరిమితంగా నీళ్లు తాగితే ఆహారం సులభంగా కదులుతుందని వివరించారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారికి నీరు మరింత ఉపయోగపడుతుందని చెప్పారు. తగినంత నీరు లేకపోతే మలబద్ధకం సమస్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

మోతాదు ముఖ్యం
భోజనం చేస్తూ నీళ్లు తాగడం వల్ల ఇబ్బంది ఉండదని, కానీ ఒకేసారి ఎక్కువగా తాగితే కొందరికి కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలగొచ్చని డాక్టర్లు తెలిపారు. ముఖ్యంగా గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ (జీఈఆర్‌డీ) ఉన్నవారిలో లక్షణాలు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. అలాంటి వారు గది ఉష్ణోగ్రతలో ఉన్న లేదా స్వల్పంగా గోరువెచ్చని నీరు తాగడం మంచిదని సూచించారు.

ఏం తాగుతున్నామన్నదీ ముఖ్యం
భోజనం సమయంలో సాధారణ నీరు తాగడం మంచిదేనని, కానీ శీతల పానీయాలు, కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌, మద్యం మాత్రం మంచివి కావని నిపుణులు తెలిపారు. ఇవి గ్యాస్‌, కడుపు ఉబ్బరం, ఎసిడిటీకి దారితీయొచ్చని చెప్పారు. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు అనవసర కేలరీలను పెంచుతాయని వివరించారు. అందుకే భోజనం సమయంలో స్వచ్ఛమైన నీరే ఉత్తమ ఎంపిక అని సూచించారు.

జీర్ణక్రియకు అసలు రహస్యం ఇదే
జీర్ణక్రియ బాగా జరగాలంటే ఒక్క నీళ్లపై కాకుండా రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టాలని డాక్టర్లు సూచించారు. ఆహారాన్ని బాగా నమలడం, నెమ్మదిగా తినడం, అతిగా తినకపోవడం, రోజంతా తగినంత నీరు తాగడం వంటి అలవాట్లే కీలకమని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న చాలా మందిలో భోజనం సమయంలో పరిమితంగా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

గమనిక: ఈ కథనం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు, జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Advertisement
Digestion
Drinking water meals
Digestive health tips
Gastroesophageal reflux disease
Healthy eating habits
Hydration benefits

More Telugu News