ఇటీవలి కాలంలో 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్ల వినియోగంపై ప్రజల్లో, మీడియాలో తలెత్తిన గందరగోళాన్ని నివృత్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టతనిచ్చింది. ఈ నంబర్ల కేటాయింపు, వినియోగంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది.

ట్రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం, 1600 సిరీస్ నంబర్లను కేవలం సేవాపరమైన, లావాదేవీలకు సంబంధించిన సమాచారం కోసమే కేటాయించారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలకు చెందిన సంస్థలతో పాటు ప్రభుత్వ విభాగాల పౌరులకు సమాచారం అందించేందుకు ఈ సిరీస్‌తో ఫోన్ నెంబర్లను వినియోగిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, ఐఆర్‌డీఏఐ వంటి నియంత్రణ సంస్థల పరిధిలోని సంస్థలు పంపే ముఖ్యమైన అలర్ట్‌లు ఈ నంబర్ల నుంచే వస్తాయి. వినియోగదారుల విశ్వసనీయతను పెంపొందించేందుకు, 1600 సిరీస్ నుంచి వచ్చే కాల్స్‌ను టెలికాం ఆపరేటర్లు లేదా థర్డ్-పార్టీ యాప్‌లు బ్లాక్ చేయడం లేదా ఫిల్టర్ చేయడానికి అనుమతి లేదని ట్రాయ్ స్పష్టం చేసింది.

అదేవిధంగా 140 సిరీస్ నంబర్లను పూర్తిగా ప్రచార (ప్రమోషనల్) కాల్స్ కోసం కేటాయించారు. వినియోగదారులు 'డూ నాట్ డిస్టర్బ్' రిజిస్ట్రీ ద్వారా ఈ కాల్స్‌ను నియంత్రించుకోవచ్చు. తమకు ఇష్టం లేని ప్రచార కాల్స్‌ను నిరోధించేందుకు డీఎన్‌డీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ట్రాయ్ పేర్కొంది. అవాంఛిత వాణిజ్య కాల్స్‌పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, కీలకమైన సేవా కాల్స్‌కు, ప్రచార కాల్స్‌కు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించేలా ఈ వివరణ ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.