ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్‌పోర్టులు... జాబితాలో రెండు భారత విమానాశ్రయాలు
- ప్రపంచంలోని అత్యంత అందమైన ఎయిర్‌పోర్టుల జాబితా విడుదల
- ప్రిక్స్ వెర్సైల్స్ 2026 జాబితాలో రెండు భారత విమానాశ్రయాలు
- గౌహతి, నవీ ముంబై ఎయిర్‌పోర్టులకు దక్కిన అరుదైన గౌరవం
- ఆధునిక డిజైన్, సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు
పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రకటించే ఈ పురస్కారం, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన లేదా ఆధునికీకరించిన విమానాశ్రయాలను గుర్తిస్తుంది. ఆధునిక డిజైన్, పర్యావరణ హిత నిర్మాణం, సాంస్కృతిక గుర్తింపు, ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఎంపిక చేపడతారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడు విమానాశ్రయాలు ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
గౌహతిలోని టెర్మినల్-2ను ఈశాన్య భారతానికి ప్రత్యేకమైన 'వెదురు ఆర్కిడ్' పుష్పాల స్ఫూర్తితో నిర్మించారు. టెర్మినల్ లోపల 'ఇండోర్ స్కై ఫారెస్ట్', అస్సామీ సంప్రదాయ హస్తకళల మేళవింపుతో దీనికి రూపకల్పన చేశారు.
ఇక, అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1ను 'కమలం' ఆకృతిలో నిర్మించారు. సహజ సిద్ధమైన వెలుతురు, గాలి ప్రసరణకు పెద్దపీట వేస్తూ, ఇంధన వినియోగాన్ని తగ్గించేలా దీన్ని అద్భుతంగా డిజైన్ చేశారు.
ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనాలోని గ్వాంగ్‌జౌ, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్, అమెరికాలోని పిట్స్‌బర్గ్, శాన్ డియాగో విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. విమానాశ్రయాలను కేవలం రవాణా కేంద్రాలుగానే కాకుండా, అద్భుతమైన సాంస్కృతిక చిహ్నాలుగా తీర్చిదిద్దడంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని ఈ అంతర్జాతీయ గుర్తింపు చాటిచెబుతోంది.