యూట్యూబ్‌లో చూసి హత్య.. 24 గంటల్లోనే కేసు ఛేదించిన కరీంనగర్ పోలీసులు

Karimnagar police solve murder case within 24 hours after suspect watched YouTube to kill
  • హత్య ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్న నిందితుడు
  • వివాహేతర సంబంధం, అవమానాలే హత్యకు కారణమని వెల్లడి
  • పీరీల పండుగ నుంచి వస్తుండగా ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య
  • నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, హత్యకు వాడిన ఆయుధం స్వాధీనం
తెలంగాణలోని కరీంనగర్‌లో దారుణ హత్యోదంతం చోటుచేసుకుంది. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోలలో చూసి, ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపిన నిందితుడిని పోలీసులు కేవలం 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఈ కేసులో బంగారపు మహేష్ (40) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు పైతరి మొగిలి (52) ఓ వివాహితపై అత్యాచార యత్నం కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలయ్యాడు. అయితే, జైలు నుంచి వచ్చాక కూడా అతను తన పద్ధతి మార్చుకోలేదు. ఆ మహిళను వేధించడం కొనసాగించాడు. అదే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నిందితుడు మహేష్‌ను కూడా మొగిలి తరచూ అవమానించేవాడు. వారి సంబంధం గురించి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేస్తూ, మహేష్ పరువు తీస్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయి.

మొగిలి నుంచి ఎదురవుతున్న నిరంతర వేధింపులు, అవమానాలు భరించలేకపోయిన మహేష్, అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో హత్యలు ఎలా చేయాలి, ఆయుధాలు ఎలా సిద్ధం చేసుకోవాలి వంటి వీడియోలు చూసి పక్కా ప్రణాళిక రచించాడు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం.. "శనివారం రాత్రి మడిపల్లి గ్రామంలో జరిగిన పీరీల పండుగకు హాజరై మొగిలి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, ఓ కల్వర్టు వద్ద కాపుకాచిన మహేష్ వెనుక నుంచి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తలపై పలుమార్లు బలంగా కొట్టి, అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి వెళ్లి, రక్తంతో తడిసిన బట్టలు మార్చుకుని పరారయ్యాడు" అని వివరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మహేష్‌ను ప్రశ్నించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్, యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ ఉన్న మొబైల్ ఫోన్, బైక్, హత్య సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా నిందితుడిపై రౌడీ షీట్ తెరిచేందుకు కూడా జిల్లా పోలీసులు యోచిస్తున్నారు.
Bangarapu Mahesh
Karimnagar murder case
YouTube crime plan
Telangana police arrest
Paitari Mogili
Huzurabad crime news

More Telugu News