కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు... రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు
- యాదగిరిగుట్ట దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు గురించి తనకు సమాచారం ఇవ్వలేదన్న రాజగోపాల్ రెడ్డి
- ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఎంపై విమర్శలు
- కాంగ్రెస్ పార్టీలో అసలైన కాంగ్రెసోళ్లు ఎక్కడున్నారని ప్రశ్న
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పటికీ తనకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. రేవంత్‌కు షోఆప్స్ ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎమ్మెల్యేనైన తనను సంప్రదించి ఉంటే తన నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడినైనా బోర్డులో చేర్పించుకునేవాడినని, కనీస ఇంగితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఏకపక్ష పోకడలు నచ్చకనే నల్గొండలో జరిగిన ముఖ్యమంత్రి సభకు తాను వెళ్లలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నా తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. అసలు కాంగ్రెస్‌లో ఒరిజినల్ కాంగ్రెసోళ్లు ఎక్కడున్నారని, ఎక్కడెక్కడి నుంచో కొత్తవాళ్లు వచ్చి అంతా వాళ్లే నడుపుతున్నారని దుయ్యబట్టారు. సీనియర్లను ఎలా గౌరవించాలో కూడా తెలియడం లేదని, నాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఒరిజినల్ లీడర్లు రోజురోజుకీ కనుమరుగవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.