టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై రాళ్ల దాడి.. సీసీటీవీ దృశ్యాల వైరల్!
- ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై దాడి
- కిటికీ అద్దాలు పగలగొట్టిన అపరిచిత వ్యక్తి
- దాడి సమయంలో కనిపించని కోల్‌కతా పోలీసులు
- బీజేపీపై ఎంపీ తీవ్రస్థాయి ధ్వజం
- నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి దాడి
మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అభిషేక్ బెనర్జీ స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి.. అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు ఆగి, పెద్ద రాళ్లను తీసుకుని మొదటి అంతస్తు కిటికీలపైకి రెండుసార్లు బలంగా విసిరాడు. ఈ దాడిలో కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన స్థలానికి సరిగ్గా పక్కనే కోల్‌కతా పోలీసులకు చెందిన భద్రతా కియోస్క్ ఉన్నప్పటికీ, ఆ సమయంలో అక్కడ పోలీసులు ఎవరూ లేకపోవడం గమనార్హం.
ఈ ఘటనపై ఎంపీ అభిషేక్ బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దాడి వెనుక బీజేపీ ‘గూండాల’ హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ‘గూండా రాజ్’ నడుస్తోందని ధ్వజమెత్తారు. "ఆ సమయంలో పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఎవరి ఆదేశాల మేరకు వారు అక్కడ లేకుండా పోయారు?" అని ఆయన నిలదీశారు. నేరస్థులకు రక్షణ కల్పిస్తున్నారా? అంటూ మండిపడ్డారు.
అలాగే, నిందితులను ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు వీలు కల్పించే 'పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్, 2026' నిబంధనలు బీజేపీ మద్దతుదారులకు కూడా వర్తిస్తాయా? లేదా? అని ప్రశ్నించారు.
నెల రోజుల్లోనే రెండోసారి
అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. అంతకుముందు, ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సోనార్‌పూర్ వెళ్లినప్పుడు కూడా రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. తాజాగా ఆయన సొంత నివాసంపైనే రాళ్ల దాడి జరగడంతో బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.