రేవంత్, భట్టి విక్రమార్క ఒకే వేదికపై వేర్వేరు లెక్కలు చెప్పారు.. ఎవరి లెక్కలు నిజం?: హరీశ్ రావు
- శిల్పకళావేదిక సాక్షిగా రేవంత్, భట్టి విక్రమార్క అబద్ధాలు చెప్పారన్న హరీశ్
- రైతుల కోసం రూ.1.56 లక్షలు ఖర్చు చేశామని భట్టి చెప్పారని వెల్లడి
- రూ.1.75 లక్షలు ఖర్చు చేశామని రేవంత్ చెప్పారని ఎద్దేవా
శిల్పకళావేదిక సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్ రెడ్డి రైతుల పేరుతో కొత్త డ్రామాలకు తెరతీశారని మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో అన్నదాతల అసలు సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు.
ఒకే సభలో పక్కపక్కనే కూర్చున్న రేవంత్, భట్టి విక్రమార్క వేర్వేరు లెక్కలు చెప్పారని హరీశ్ ఎద్దేవా చేశారు. రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని భట్టి విక్రమార్క చెబితే... రేవంత్ రెడ్డి ఏకంగా రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారని... అసలు వీరిద్దరిలో ఎవరి లెక్కలు నిజమో చెప్పాలని నిలదీశారు. 2027 మార్చి వరకు వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82 వేల కోట్లు అయితే, 2026 జూన్ నాటికే లక్షన్నర కోట్లకు పైగా ఎలా ఖర్చు చేశారో సమాధానం చెప్పాలన్నారు.
ఎన్నికల సమయంలో షరతులు లేని రూ.2 లక్షల రుణమాఫీ అని ఓట్లు దండుకుని, తీరా అధికారంలోకి వచ్చాక కేవలం స్వల్పకాలిక రుణాలకే అది వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం రైతులను నిలువునా ముంచడమేనన్నారు. ఇకనైనా ఫేక్ ప్రచారాలు ఆపి, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో అన్నదాతలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చేసిన రైతు మోసాలపై అసెంబ్లీతో పాటు ఏ వేదికపైనైనా చర్చకు తాము సిద్ధమంటూ సవాల్ విసిరారు.