దోహా చర్చల వేళ అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్: శాంతికి సిద్ధం.. యుద్ధానికీ రెడీ!

Iran issues stern warning to US during Doha talks ready for peace and war
  • శాంతి చర్చలకు ముందే యుద్ధ నినాదం
  • అణు హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  • లెబనాన్ సార్వభౌమత్వానికి ఇరాన్ డిమాండ్ 
  • చర్చల మధ్య పెరిగిన చమురు ఎగుమతులు
ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికాతో కీలకమైన చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాము దౌత్యపరమైన శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని, ఒకవేళ ఈ చర్చలు విఫలమై, ఇచ్చిన మాట తప్పితే మాత్రం 'యుద్ధానికి కూడా సిద్ధమే'నని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల  ప్రధాన ప్రతినిధి మహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. శుద్ధిచేసిన యురేనియంతో కూడిన తమ దేశ అణు హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అది ఇరాన్ విధించుకున్న 'రెడ్ లైన్' (లక్ష్మణ రేఖ) అని ఆయన తేల్చిచెప్పారు.

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని కొన్ని కీలక నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు తాము తదుపరి దశకు వెళ్లబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా లెబనాన్‌లో యుద్ధాన్ని ముగించి, దాని సార్వభౌమత్వాన్ని కాపాడటం, ఇరాన్ చమురు ఎగుమతులు, అలాగే వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకల భద్రత వంటి అంశాలపై పట్టుబట్టింది. గతంలో 2015 నాటి అణు ఒప్పందం విషయంలో అమెరికా ఇచ్చిన హామీలను ఉల్లంఘించిన తీరును గాలిబాఫ్ ఈ సందర్భంగా విమర్శించారు. లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణ కోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రయత్నిస్తున్నారని, ఇది ప్రస్తుత అవగాహన ఒప్పందానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు.

అమెరికా విధించిన ఆంక్షలు (బ్లాకేడ్) తొలగిపోయిన తర్వాత తమ దేశ చమురు ఎగుమతులు పెరిగాయని, ప్రస్తుతం 40 మిలియన్ బారెళ్లకు పైగా చమురును ఎగుమతి చేస్తున్నట్లు గాలిబాఫ్ వెల్లడించారు. ఖతార్ విదేశాంగ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మధ్యవర్తిత్వ చర్చలలో అమెరికా అధికారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు కూడా పాల్గొంటున్నారు. అవగాహన ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతోనే ఈ దోహా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ ఒకవైపు చర్చలకు వస్తూనే.. మరోవైపు సైనికపరంగా యుద్ధానికి సై అనడం అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Iran
Doha Talks
Mohammad Bagher Ghalibaf
United States
Iran Nuclear Deal
Middle East Conflict

More Telugu News