ఇక పిల్లల పౌరసత్వంపై ఢోకా లేదు.. యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు మనోళ్లకు ఎలా మేలు చేస్తుందంటే..!
- అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలకు చుక్కెదురు
- సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కీలక తీర్పు వెల్లడి
- హెచ్-1బీ, ఇతర వీసాలపై ఉన్న లక్షలాది భారతీయులకు భారీ ఊరట
- అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం కొనసాగుతుందని స్పష్టీకరణ
- సుప్రీం తీర్పును స్వాగతించిన భారతీయ-అమెరికన్ సమాజం
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన రెండోసారి పదవీకాలం చేపట్టిన తొలిరోజే జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కొట్టివేసింది. అక్రమంగా దేశంలో నివసిస్తున్న తల్లిదండ్రుల పిల్లలకు, తాత్కాలిక వీసాలపై వచ్చే పర్యాటకుల పిల్లలకు జన్మతః పౌరసత్వం నిరాకరించాలని ట్రంప్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా తీర్పుతో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి.
భారతీయులకు ఎంతో కీలకం
ఈ తీర్పు అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ సమాజానికి ఎంతో కీలకమైంది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 3.2 మిలియన్ల మంది డాక్యుమెంట్లు ఉన్న భారతీయులు నివసిస్తుండగా, వీరు మెక్సికన్ల తర్వాత రెండో అతిపెద్ద వలస సమాజంగా ఉన్నారు. అంతేగాక గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 10 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. అలాగే, సుమారు 7,25,000 మంది పత్రాలు లేని భారతీయులు కూడా అమెరికాలో నివసిస్తున్నారు.
ఈ తీర్పుతో హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1 వంటి తాత్కాలిక వీసాలపై ఉంటూ గ్రీన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి పిల్లలకు, అమెరికాలో పుడితే సహజంగానే పౌరసత్వం లభిస్తుంది. ఇది వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది.
భారతీయ-అమెరికన్ల హర్షం
ఈ తీర్పును భారతీయ-అమెరికన్ సమాజం పెద్ద ఎత్తున స్వాగతించింది. "ట్రంప్ ఉత్తర్వుల వల్ల భారతీయ, దక్షిణాసియా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయేవి. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి పిల్లలు ఇక్కడే పుడతారు. ఈ తీర్పుతో 'మీ పిల్లలు అమెరికన్లే, వారు ఇక్కడికి చెందినవారే' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది" అని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ అన్నారు.
"అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డ అమెరికా పౌరుడే అనే ప్రాథమిక రాజ్యాంగ సూత్రాన్ని ఈ తీర్పు పునరుద్ఘాటించింది" అని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు. రాజ్యాంగ హక్కులను కార్యనిర్వాహక ఉత్తర్వులతో మార్చలేరని ఆయన స్పష్టం చేశారు. "జన్మతః పౌరసత్వం అనేది వలసదారులకు 'అమెరికన్ డ్రీమ్'ను సాకారం చేసుకోవడంలో మూలస్తంభం వంటిది" అని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) అధ్యక్షుడు ఖండేరావు కండ్ వ్యాఖ్యానించారు.
తీర్పు వివరాలు.. ట్రంప్ స్పందన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అంతర్యుద్ధం తర్వాత ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం, అమెరికాలో పుట్టిన ఎవరైనా పౌరులేనని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌లు శామ్యూల్ అలిటో, నీల్ గోర్సచ్, క్లారెన్స్ థామస్ ఈ తీర్పుతో విభేదించారు. ఈ తీర్పుపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. ఇది దేశానికి చాలా చెడ్డదని వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమైనది కావడంతో దీనిని మార్చాలంటే కేవలం చట్టం సరిపోదు, రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది.