గ్రీక్‌ యోగర్ట్‌.. పెరుగు ఒకటేనా? ఏది ఆరోగ్యానికి మంచిది?

Greek Yogurt vs Curd Which is Better for Health
  • గ్రీక్‌ యోగర్ట్‌, పెరుగు ఒకటి కావు
  • గ్రీక్‌ యోగర్ట్‌లో ప్రోటీన్‌ ఎక్కువ
  • పెరుగులో కాల్షియం కొద్దిగా అధికం
  • రెండింట్లోనూ ప్రోబయోటిక్స్‌ ఉంటాయి
  • బరువు నియంత్రణకు గ్రీక్‌ యోగర్ట్‌కు ప్రాధాన్యం
గ్రీక్‌ యోగర్ట్‌, పెరుగు చూడటానికి దాదాపు ఒకేలా కనిపిస్తాయి. కానీ రెండూ ఒకటి కావు. తయారీ విధానం, పోషక విలువలు, రుచి, ప్రయోజనాల్లో స్పష్టమైన తేడాలు ఉంటాయి. మీ ఆరోగ్య లక్ష్యం ఏమిటనేదాన్ని బట్టి వీటిలో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు.

సాధారణ పెరుగును... గోరువెచ్చని పాలలో మజ్జిగ లేదా పెరుగు కలిపి పులియబెట్టి తయారు చేస్తారు. గ్రీక్‌ యోగర్ట్‌ను మాత్రం సాధారణ పెరుగును పలుమార్లు వడకట్టి అందులోని నీటిని తొలగిస్తారు. అందుకే అది మరింత చిక్కగా, క్రీమీగా ఉంటుంది. రుచిలో కూడా తేడా కనిపిస్తుంది. పెరుగు తేలికగా, స్వల్ప పులుపుతో ఉంటుంది. గ్రీక్‌ యోగర్ట్‌లో పులుపు కాస్త ఎక్కువగా ఉంటుంది. చిక్కటి పదార్థం కావడంతో క్రీమీ అనుభూతి కూడా ఎక్కువగా ఉంటుంది.

పోషక విలువల విషయానికి వస్తే గ్రీక్‌ యోగర్ట్‌లో ప్రొటీన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. వెన్న తొలగించే ప్రక్రియలో ప్రొటీన్‌ సాంద్రత పెరుగుతుంది. అందుకే వ్యాయామం చేసే వారు, కండరాల బలం పెంచుకోవాలనుకునే వారు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. మరోవైపు పెరుగులో కాల్షియం, కార్బోహైడ్రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఇది ఉపయోగించే పాల రకాన్ని బట్టి మారుతుంది.

రెండింట్లోనూ ప్రేగుల ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడతాయి. ఇంట్లో పరిశుభ్రంగా తయారు చేసిన పెరుగు కూడా మంచి ప్రోబయోటిక్‌ ఆహారమే. బరువు తగ్గాలనుకునేవారికి గ్రీక్‌ యోగర్ట్‌ మెరుగైన ఎంపికగా భావిస్తారు. ఇందులో ప్రొటీన్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అయితే తక్కువ కొవ్వు ఉన్న పాలతో చేసిన పెరుగు కూడా బరువు నియంత్రణలో భాగం కావచ్చు.

వాడకంలో మాత్రం పెరుగుదే పైచేయి. రైతా, మజ్జిగ, కూరలు, మారినేషన్‌, స్వీట్లలో పెరుగును విస్తృతంగా ఉపయోగిస్తారు. గ్రీక్‌ యోగర్ట్‌ను స్మూతీలు, బ్రేక్‌ఫాస్ట్‌ బౌల్స్‌, సలాడ్‌ డ్రెస్సింగ్‌లు, డిప్స్‌, డెజర్ట్‌లలో ఎక్కువగా వాడుతారు. కొన్ని వంటల్లో క్రీమ్‌, మయోనైజ్‌కు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగిస్తున్నారు.

మొత్తానికి ఎక్కువ ప్రొటీన్‌ కావాలంటే గ్రీక్‌ యోగర్ట్‌ మంచి ఎంపిక. రోజువారీ ఆహారంలో సులభంగా కలిపి తీసుకోవాలంటే పెరుగు చక్కని ప్రత్యామ్నాయం. రెండూ పోషక విలువలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలే.
Greek Yogurt
Curd
Probiotics
Protein Rich Food
Weight Loss Diet
Nutrition Differences

More Telugu News