రూ. 4 లక్షల కోట్ల ఫేక్ మార్కెట్.. రహస్య ఏజెంట్లను ప్రయోగిస్తున్న బ్రాండ్లు!

Luxury Brands Deploy Secret Agents to Tackle 4 Lakh Crore Fake Market
  • ఇండియాలో నకిలీ వస్తువుల మార్కెట్‌పై లగ్జరీ బ్రాండ్ల ప్రత్యేక దృష్టి
  • ఫేక్ సరుకును గుర్తించేందుకు రహస్య ఇన్వెస్టిగేటర్ల నియామకం
  • డమ్మీ కస్టమర్లుగా వెళ్లి సమాచారం సేకరిస్తున్న ఏజెంట్లు
  • వీరి సమాచారంతో పోలీసుల దాడులు, కేసులు నమోదు
  • దేశంలో నకిలీ దుస్తుల మార్కెట్ విలువ రూ. 4 లక్షల కోట్లుగా అంచనా
అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్‌లో భారీగా విస్తరించిన నకిలీ వస్తువుల మార్కెట్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి. వెర్సాచీ, మైఖేల్ కోర్స్, జిమ్మీ చూ వంటి ప్రఖ్యాత కంపెనీలు నకిలీ సరుకును అరికట్టేందుకు రహస్య ఇన్వెస్టిగేటర్లను నియమించుకుంటున్నాయి. వీరు సాధారణ కస్టమర్ల రూపంలో మార్కెట్లలోకి వెళ్లి, నకిలీ వస్తువులను విక్రయించే వారి సమాచారాన్ని సేకరించి కంపెనీలకు అందిస్తున్నారు.

ఈ సమాచారం ఆధారంగా సదరు బ్రాండ్లు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి, నకిలీ సరుకును స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. గతనెలలో వెర్సాచీ కంపెనీకి ఓ ఇన్వెస్టిగేటర్ ఇచ్చిన సమాచారంతో తూర్పు ఢిల్లీలోని ఓ బల్క్ సెల్లర్‌పై పోలీసులు దాడి చేశారు. నగరంలోని పలు దుకాణాలకు నెలనెలా లక్షల రూపాయల విలువైన నకిలీ సరుకును సరఫరా చేస్తున్న అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, స్టాక్‌ను సీజ్ చేశారు.

భారత్‌లో అసలైన లగ్జరీ మార్కెట్ విలువ 6 నుంచి 8 బిలియన్ డాలర్లు కాగా, 2028 నాటికి ఇది 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే, దీనికి భిన్నంగా నకిలీ దుస్తులు, యాక్సెసరీల మార్కెట్ విలువ సుమారు రూ. 4 లక్షల కోట్లు ఉంటుందని 2024 ఫిక్కీ నివేదిక పేర్కొంది. రోడ్ల పక్కన అమ్మకాల నుంచి ఆన్‌లైన్ వేదికల ద్వారా వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా ఈ దందా విస్తరించింది.

బ్రాండ్లు తీసుకుంటున్న ఈ చర్యలను న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. ఈ సమస్య తీవ్రతకు, సంప్రదాయ పద్ధతుల్లోని పరిమితులకు ఇది అద్దం పడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి రహస్య ఆపరేషన్ల ద్వారానే బలమైన ఆధారాలు సేకరించి కోర్టులో కేసులు నిలబడేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించేందుకు వెర్సాచీ, మైఖేల్ కోర్స్ వంటి కంపెనీలు నిరాకరించాయి.


Luxury Brands
Fake Market India
Counterfeit Goods
Versace Michael Kors Jimmy Choo
Secret Investigators
FICCI Report 2024

More Telugu News