భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ రంగం సరికొత్త దశలోకి అడుగుపెడుతోంది. కేవలం 10-15 నిమిషాల్లో డెలివరీ అందించే వేగం నుంచి ఇప్పుడు కంపెనీల దృష్టి స్థిరమైన లాభదాయకత, నిర్వహణ సామర్థ్యం, యూనిట్ ఎకనామిక్స్ వైపు మళ్లింది. బ్లింకిట్, జెప్టో , స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్రధాన సంస్థలకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఈ రంగంలో వ్యూహాలు వేగంగా మారుతున్నాయి.

ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌తో ఈ రంగం అనూహ్య వృద్ధిని సాధించింది. ప్రస్తుతం క్విక్ కామర్స్ మార్కెట్‌లో ఎటర్నల్ (గతంలో జొమాటో) యాజమాన్యంలోని బ్లింకిట్ సుమారు 45-50% వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 200కు పైగా నగరాల్లో 2,243 డార్క్ స్టోర్లతో అతిపెద్ద నెట్‌వర్క్‌ను ఇది కలిగి ఉంది. జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ చెరో 20-25% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. FY26 ముగిసే నాటికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 1,143, జెప్టో 1,139 డార్క్ స్టోర్లను నిర్వహిస్తున్నాయి.

ఈ పోటీని మరింత తీవ్రం చేస్తూ, ఫ్లిప్‌కార్ట్ తన 'ఫ్లిప్‌కార్ట్ మినిట్స్' కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇప్పటికే 1,000 మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 180 నగరాల్లో 1,500 డార్క్ స్టోర్లను లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, అమెజాన్ కూడా తన 'అమెజాన్ నౌ' సేవలను 300 నగరాలకు విస్తరించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది. భారతదేశంలో 48 బిలియ‌న్ డాల‌ర్ల‌ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా అమెజాన్ ఈ రంగాన్ని సీరియస్‌గా తీసుకుంది.

విశ్లేషకుల అంచనా ప్రకారం, కేవలం వేగవంతమైన డెలివరీ మాత్రమే కాకుండా వినియోగదారులను నిలుపుకోవడం, సరఫరా వ్యవస్థను మెరుగుపరచుకోవడం, లాభాలను ఆర్జించడం వంటి అంశాలపైనే కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిదారుల అంచనాలు కూడా 'వేగవంతమైన వృద్ధి' నుంచి 'స్థిరమైన వ్యాపార నమూనాల' వైపు మారడమే ఈ వ్యూహాత్మక మార్పునకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే కంపెనీలు నిత్యావసర సరుకులతో పాటు ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను కూడా డెలివరీ చేస్తూ తమ ఆదాయ మార్గాలను మెరుగుపరచుకుంటున్నాయి.

మొత్తం మీద, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత రిటైల్ రంగంలో ఈ తీవ్రమైన పోటీ వినియోగదారులకు ప్రయోజనకరంగా మారనుండగా, కంపెనీలకు మాత్రం ఆర్థిక క్రమశిక్షణతో కూడిన వృద్ధిని సాధించడం పెద్ద సవాల్‌గా నిలవనుంది.