కార్పొరేట్ ఉద్యోగులకు మెట్రోనే బెస్ట్.. సొంత కారు, క్యాబ్ ఖర్చులపై షాకింగ్ రిపోర్ట్!
- రోజుకు 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే మెట్రోకు అయ్యే ఖర్చు నెలకు రూ. 2,500 లోపే
- అదే దూరానికి సొంత కారు వాడితే నెలకు రూ. 15,000 పైగా ఖర్చు
- యాప్ ఆధారిత క్యాబ్‌ల కోసం నెలకు రూ. 22,000 వరకు చెల్లించాల్సిందే
- చివరి గమ్యస్థానానికి కనెక్టివిటీ, రద్దీ మెట్రోలో ప్రధాన సమస్యలు
ఈ నివేదిక ప్రకారం.. ప్రతిరోజూ ఆఫీసు లేదా కాలేజీ కోసం ఒకవైపు 20 కిలోమీటర్ల చొప్పున (రానుపోను 40 కి.మీ) ప్రయాణించే వ్యక్తికి మెట్రో ద్వారా నెలకు కేవలం రూ.1,100 నుంచి రూ. 2,500 వరకు మాత్రమే ఖర్చవుతుంది. అదే వ్యక్తి సొంత కారును ఉపయోగిస్తే.. ఇంధన ధరలు, పార్కింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్, కార్ మెయింటెనెన్స్, తరుగుదల (Depreciation) అన్నీ కలిపి నెలకు కనీసం రూ. 8,000 నుంచి రూ. 15,000 పైనే భారం పడుతోంది. ఇక రోజువారీ ప్రయాణాల కోసం యాప్ ఆధారిత క్యాబ్‌లపై ఆధారపడితే.. డిమాండ్, సర్జ్ ప్రైసింగ్ (Surge Pricing) కారణంగా నెలకు ఏకంగా రూ. 11,000 నుంచి రూ. 22,000 వరకు జేబులు ఖాళీ అవుతున్నట్లు లెక్కలు తేల్చాయి.
మెట్రో ప్రయాణం వల్ల సొంత కారు ఖర్చులో నాలుగో వంతు మాత్రమే ఖర్చవుతుందని, ఇది డబ్బుతో పాటు ట్రాఫిక్ జామ్‌ల వల్ల కలిగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే, మెట్రో స్టేషన్ల నుంచి ఇళ్లకు లేదా ఆఫీసులకు వెళ్లడానికి సరైన లాస్ట్-మైల్ కనెక్టివిటీ (Last-mile connectivity) లేకపోవడం, రద్దీ సమయాల్లో ఉండే విపరీతమైన జనం మెట్రోలోని ప్రధాన లోపాలుగా మారాయి. అయినప్పటికీ, కారు ఓనర్‌షిప్ తెచ్చే అదనపు అప్పులు, క్యాబ్ డ్రైవర్ల లభ్యత సమస్యలతో పోలిస్తే.. 2026లో కూడా భారతదేశపు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన, పొదుపైన ప్రయాణ సాధనంగా మెట్రోనే మొదటి స్థానంలో నిలిచింది.