‘డైమండ్‌ క్యాపిటల్‌’ అని భారత్‌లో ఏ నగరాన్ని అంటారో తెలుసా?

Do you know which city is called the Diamond Capital of India
  • భారత వజ్రాల రాజధానిగా సూరత్‌కు గుర్తింపు
  • ప్రపంచంలోని 90 శాతం వజ్రాల పాలిషింగ్ ఇక్కడే
  • సూరత్ వజ్రాలకు దక్కిన జీఐ ట్యాగ్
  • ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్‌ కాంప్లెక్స్‌ డైమండ్ బోర్సే
  • టెక్స్‌టైల్స్ రంగంలో ‘సిల్క్ సిటీ’గానూ ప్రసిద్ధి
వజ్రం.. ఈ భూమిపైనే అత్యంత ఖరీదైన రత్నం. గనుల నుంచి ముడి రూపంలో వచ్చే ఆ రాయిని కోటి కాంతుల వజ్రంగా మార్చే అద్భుత మంత్రదండం ఎక్కడుందో తెలుసా? ఏ ఆఫ్రికా అడవుల్లోనో, అమెరికా ల్యాబ్‌ల్లోనో కాదు.. మన గుజరాత్‌లోని ‘సూరత్’ నగరంలో! ప్రపంచవ్యాప్తంగా నగల దుకాణాల్లో మెరుస్తున్న ప్రతి 10 వజ్రాల్లో 9 ఈ గడ్డపైనే రూపుదిద్దుకుంటాయి. అందుకే ఈ నగరానికి  ‘‘డైమండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’’ అని పేరొచ్చింది.

సానబెట్టే నైపుణ్యం
తపతీ నది ఒడ్డున ఉండే సూరత్ ప్రస్థానం కొందరు స్థానిక వ్యాపారుల విజనరీతో మలుపు తిరిగింది. ఇక్కడి కళాకారుల చేతుల్లో ఏదైనా మాయ ఉందా? అనిపిస్తుంది. ముడి వజ్రాన్ని అత్యంత కచ్చితత్వంతో కటింగ్, పాలిషింగ్ చేయడంలో వారి నైపుణ్యం, తక్కువ ఖర్చుతో కూడిన మేనేజ్‌మెంట్ సూరత్‌ను తిరుగులేని గ్లోబల్ హబ్‌గా మార్చాయి. దీనికి గుర్తింపుగా ఇటీవల ‘సూరత్ కట్ డైమండ్’కు ప్రతిష్ఠాత్మక ‘భౌగోళిక గుర్తింపు’ (జీఐ ట్యాగ్‌) కూడా లభించింది. నేడు ఈ ఒక్క పరిశ్రమపైనే ఆధారపడి లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.

పెంటగాన్‌ను దాటేసిన 'డైమండ్ బోర్సే'
సూరత్ ఖ్యాతిని ప్రపంచ పటంలో మరో మెట్టు ఎక్కించిన అద్భుతం ‘సూరత్ డైమండ్ బోర్సే’. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’ కంటే పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ ఇది. వజ్రాల వ్యాపారులు, డిజైనర్లు, ఎగుమతిదారులు అందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చిన ఈ భారీ బిజినెస్ హబ్.. అంతర్జాతీయ మార్కెట్లో సూరత్‌ను వజ్రాల రారాజుగా నిలబెట్టింది.

సిల్క్ సిటీ కూడా ఇదే..
సూరత్ కేవలం డైమండ్స్‌తోనే కాదు.. టెక్స్‌టైల్స్ రంగంలోనూ దేశంలో టాప్‌లో దూసుకుపోతోంది. అందుకే దీనిని ప్రేమగా ‘సిల్క్ సిటీ’ అని కూడా అంటారు. పారిశుద్ధ్యంలోనూ, వేగవంతమైన పట్టణాభివృద్ధిలోనూ ఇండియాలోనే ది బెస్ట్ సిటీగా నిలిచిన సూరత్.. ప్రపంచంలో ఎక్కడో పుట్టిన ముడి రాయిని తన నైపుణ్యంతో అద్భుత రత్నంగా మార్చి విశ్వవ్యాప్తం చేస్తోంది. గనులు ఎక్కడున్నా.. మెరుగులు అద్దేది మాత్రం సూరతే!
Go Back to Shorts
Surat
Diamond Capital of India
Surat Diamond Bourse
Diamond Cutting and Polishing
GI Tag Surat Cut Diamond
Silk City Surat

More Telugu News