ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర.. నెహ్రూ రికార్డు బ్రేక్
- సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు
- జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన మోదీ
- 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రత్యేక సమావేశం
- ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న కార్యక్రమానికి అగ్రనేతల హాజరు
- మోదీకి అభినందనగా తీర్మానం ఆమోదించే అవకాశం
1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నెహ్రూ పదవీకాలాన్ని (4,398 రోజులు) ఈ పోలికకు ప్రామాణికంగా తీసుకున్నారు. ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా ప్రధానిగా పనిచేసినప్పటికీ, ఆమె పదవీకాలం నిరంతరాయంగా కొనసాగలేదు. దీంతో 2014, 2019, 2024లలో వరుసగా మూడుసార్లు చారిత్రక విజయం సాధించి, నిరవధికంగా ప్రధానిగా కొనసాగుతున్న నేతగా మోదీ నిలిచారు.
ఈ చారిత్రక ఘనతను, ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని బుధవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ విధానాలు, రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మోదీ హయాంలో కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా, కర్తవ్య పథ్, వందే భారత్ రైళ్లు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.