మొక్కలకు నీళ్లు ఎప్పుడు పోస్తున్నారు?.. ఈ ఒక్క పొరపాటుతో అవి చనిపోవచ్చు!

Watering Plants Why Morning is the Ideal Time for Healthy Growth
  • మధ్యాహ్నం నీళ్లు పోస్తే నీటి వృథా
  • వేర్లకు చేరకముందే నీరు ఆవిరి
  • ఉదయం 5-9 గంటల మధ్య ఉత్తమ సమయం
  • రాత్రి తేమతో ఫంగస్‌ ముప్పు
  • చలికాలంలో మధ్యాహ్నమే అనుకూలం
  • నేల తేమ చూసి నీళ్లు పోయాలని సూచన
మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువులు, మంచి మట్టి మాత్రమే కాదు.. నీళ్లు పోసే సమయం కూడా కీలకం. చాలామంది సమయం దొరికినప్పుడల్లా మొక్కలకు నీళ్లు పోస్తుంటారు. కానీ ఎండ ఎక్కువగా ఉండే వేళలో నీళ్లు పోయడం వల్ల వాటికి మేలు కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో నీళ్లు పోస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే కాదు.. నీటి వృథా కూడా తగ్గుతుంది.

మధ్యాహ్నం నీళ్లు పోస్తే
ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్నం సమయంలో మొక్కలకు పోసిన నీటిలో చాలా వరకు వేర్ల వరకు చేరకముందే ఆవిరైపోతుంది. ఫలితంగా మొక్కలకు అవసరమైన తేమ అందదు. అంతేకాదు.. ఎక్కువ నీళ్లు పోసినా ఆశించిన ప్రయోజనం ఉండదు. నీటి బిల్లు పెరగడంతో పాటు నీటి వృథా కూడా జరుగుతుంది.

ఉదయమే ఉత్తమం
వ్యవసాయ, ఉద్యాన నిపుణుల సూచనల ప్రకారం ఉదయం 5 నుంచి 9 గంటల మధ్య మొక్కలకు నీళ్లు పోయడం ఉత్తమం. ఈ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో నీరు వేర్ల వరకు బాగా చేరుతుంది. ఆకులపై పడిన తేమ కూడా కొద్దిసేపటికే ఆరిపోతుంది. దీంతో శిలీంధ్రాలు, ఇతర వ్యాధులు సోకే ప్రమాదం తగ్గుతుంది.

రాత్రి కూడా జాగ్రత్త
మధ్యాహ్నం కంటే రాత్రి మంచిదని చాలామంది భావిస్తారు. అయితే తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది కూడా సమస్యలకు దారితీయొచ్చు. రాత్రంతా ఆకులు తడిగా ఉండటం వల్ల ఫంగస్‌, ఇతర వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం నీళ్లు పోయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో మాత్రం.. 
వేసవిలో వర్తించే నిబంధన చలికాలంలో మారుతుంది. చలి ఎక్కువగా ఉన్న రోజుల్లో మధ్యాహ్నం నీళ్లు పోయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నీరు నేలలో బాగా ఇంకిపోతుంది. సాయంత్రం ఆలస్యంగా నీళ్లు పోస్తే గడ్డకట్టే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

సమయం కంటే అవసరమే ముఖ్యం
అయితే గడియారం చూసి మాత్రమే నీళ్లు పోయాల్సిన అవసరం లేదని ఉద్యాన నిపుణులు చెబుతున్నారు. ముందుగా నేలలో తేమ ఉందో లేదో పరీక్షించాలి. వేలు పెట్టి చూసినప్పుడు నేల పొడిగా అనిపిస్తేనే నీళ్లు పోయాలి. ఎండలో మొక్కలు వాడిపోతున్నట్లు కనిపిస్తే ఆ సమయంలో కూడా నీరు ఇవ్వొచ్చు. కానీ రోజూ మధ్యాహ్నం నీళ్లు పోయడం మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.
Advertisement
Watering Plants
Best time to water plants
Gardening tips
Plant care guide
Morning watering benefits
Winter gardening tips

More Telugu News